నేడు హరియాణా గవర్నర్ రాక
వెంకటాచలం: హరియాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కు రానున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రజామందిరంలో జరగనున్న మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనుమడు విష్ణు వివాహ రిసెప్షన్‌కు హాజరవుతున్నారని ట్రస్ట్ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.45 గంటలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఈ రిసెప్షన్ వేడుకలకు హాజరుకానున్నారు.
స్థానిక సంస్థల్లో పోటీకి సంతానం అడ్డుకాదు
● ఆ నిబంధన సడలిస్తూ
గెజిట్ జారీ చేసిన న్యాయశాఖ
సీతారామపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల పోటీకి సంబంధించి ఉన్న ‘సంతానం’ నిబంధనలను పంచాయతీరాజ్ చట్టం నుంచి తొలగిస్తూ న్యాయశాఖ ఈ నెల 12న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధన ఇప్పటి వరకు పంచాయతీరాజ్ చట్టంలో ఉంది. 30 ఏళ్ల కిందట దేశ జనాభా రికార్డు స్థాయిలో పెరిగిన నేపథ్యంలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. కుటుంబ నియంత్రణకు శ్రీకారం చుట్టాయి. ప్రత్యేక చట్టాలు తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించారు. అప్పట్లో ఈ నిబంధన కలకలం రేపి ఎంతో మంది రాజకీయ ఆశావహులపై నీళ్లు చల్లింది. తాజా నిర్ణయంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఎండలోనే నిలువ కాళ్లపై ఎన్‌సీసీ విద్యార్థులు
కందుకూరు రూరల్: కందుకూరులోని దూబగుంట వద్ద పారిశుధ్య కార్యక్రమాన్ని, ఇంకుడు గుంతను సీఎం చంద్రబాబు పరిశీలించే సమయంలో సెల్యూట్ కొట్టేందుకు స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్‌సీపీ విద్యార్థులను ఎండలో నిలువు కాళ్లపై రోడ్డుపై నిలబెట్టారు. సీఎం వచ్చే గంట ముందు నుంచే వారితో ఎండలో మాక్ డ్రిల్ చేయించారు. ఎండ తీవ్రత ఉన్న సమయంలో ఆకలి దప్పులతో ఎన్‌సీసీ విద్యార్థులను ఇలా ఇబ్బంది పెట్టడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. తిరిగి సీఎం వెళ్లిపోయిన తర్వాత కనిగిరి రోడ్డులో చెట్ల కింద వారికి మధ్యాహ్న 2.50 గంటలకు భోజనం పెట్టారు.
క్లస్టర్ సమావేశాలు ఎంతో ఉపయోగం
వరికుంటపాడు: ఉన్నత పాఠశాల్లో నిర్వహిస్తున్న పాఠశాల స్థాయి క్లస్టర్ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతామని ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం మండలంలోని వరికుంటపాడు, తిమ్మారెడ్డిపల్లి ఉన్నత పాఠశాలల్లో జరిగిన ప్లస్ క్లస్టర్ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం క్లస్టర్ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశాలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు హాజరైతే బోధనా నైపుణ్యాలు, పద్ధతులపై చర్చించుకోవచ్చన్నారు. క్లస్టర్ సమావేశాలు జ్ఞాన భాండాగారాలుగా తయారు అవుతాయని, విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్య నందించవచ్చన్నారు. సమావేశాల్లో మాదిరి పాఠ్యాంశ బోధనకు ప్రతి ఉపాధ్యాయుడు సిద్ధం కావాలన్నారు. బోధనకు ముందు ఉపాధ్యాయులు సంసిద్ధత కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశాల్లో ఎంఈఓ–1, 2 షేక్ మస్తాన్‌వలి, సీహెచ్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన సీఎం పర్యటన
నెల్లూరు(క్రైమ్): సీఎం చంద్రబాబు కందుకూరు పర్యటన శనివారం భారీ బందోబస్తు నడుమ ముగిసింది. ఈ నేపథ్యంలో ఎస్పీ జి.కృష్ణకాంత్ 1,060 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. పర్యటన ఆద్యంతం ప్రశాంతంగా ముగియడంతో పటిష్టంగా బందోబస్తు విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. సహకరించిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల సిబ్బందికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
నేడు హరియాణా గవర్నర్ రాక
Comments
Please login to add a commentAdd a comment