ఆందోళన వద్దు
● బర్డ్ ఫ్లూపై చర్యలు శూన్యం
ఎక్కడా ఇబ్బందుల్లేవు
● నష్టపోతున్న నిర్వాహకులు
● ఆర్నెల్ల క్రితమే గుర్తించినా
ముందస్తు చర్యలేవీ..?
● అంతా అయ్యాక
టీకాల పేరిట హడావుడి
నెల్లూరు(సెంట్రల్): బర్డ్ ఫ్లూ కేసులు జిల్లాలో ఆర్నెల్ల క్రితమే నమోదైనా, సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పెద్దగా నష్టం ఉండదంటూ పశుసంవర్థక శాఖ అధికారులూ నిర్లిప్త ధోరణిని కనబర్చారు. ఫలితంగా ఈ వైరస్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విజృంబిస్తూ పౌల్ట్రీ రంగాన్ని కకావికలం చేస్తోంది.
నష్టపోతున్న నిర్వాహకులు
జిల్లాకు ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటారు. జిల్లాలో పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కోళ్ల ఫారాలను కొందరు నిర్వహిస్తున్నారు. 19 ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫారాలుండగా, ప్రస్తుత ఇబ్బందుల తరుణంలో అది పదికే పరిమితమైంది. ఇందులో దాదాపు మూడు లక్షల కోళ్లను పెంచుతున్నారని సమాచారం. చిన్నచితకా చికెన్ వ్యాపారులు వారి షాపుల వద్దే కోళ్లను పెంచుకుంటున్నారు. వీటిలో ఒక్క దానికి వ్యాధి వచ్చినా, మిగిలినవి మృత్యువాతపడే అవకాశాలున్నాయి. అధికారులు మాత్రం ఈ విషయాన్ని బయటకు రానివ్వడంలేదు. ఎక్కడ తమ నిర్లక్ష్యం బయటపడుతుందోననే భయంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో స్పందించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. మీరే జాగ్రత్తలు పాటించాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామంటూ పౌల్ట్రీ నిర్వాహకులను కొందరు అధికారులు హెచ్చరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
అంతులేని నిర్లక్ష్యం
జిల్లాలో బర్డ్ ప్లూ ఆనవాళ్లు కోళ్లకు వచ్చాయనే అంశం ఆర్నెల్ల క్రితమే బయటపడింది. గుమ్మళ్లదిబ్బ, చాటగొట్ల ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. వ్యాధి కారణంగా అప్పట్లో దాదాపు పది వేల కోళ్లకుపైగా చనిపోయాయి. అప్పట్లో ఈ వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. కేంద్రం నుంచి నెల్లూరొచ్చిన ప్రత్యేక బృందం అధ్యయనం చేసి బర్డ్‌ఫ్లూ అని నిర్ధారించింది. కొన్ని రోజుల పాటు ఈ ప్రాంతాల్లో పది కిలోమీటర్ల మేర ప్రత్యేక జోన్‌ను ప్రకటించారు.
ఇప్పుడు హడావుడి..
బర్డ్ ఫ్లూ అనేది హెచ్5ఎన్1 అనే వైరస్ ద్వారా వస్తుందని సంబంధిత శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వ్యాధి ఒక కోడి నుంచి మరోదానికి వ్యాపించి మృత్యువాత పడే అవకాశాలున్నాయి. తాజాగా ఉభయగోదావరి జిల్లాల్లో వెలుగులోకి రావడంతో టీకాలంటూ జిల్లాలో సంబంధిత శాఖ అధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. పౌల్ట్రీ నిర్వాహకుల వద్దకెళ్లి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కోళ్లను అనుమతించొద్దని, ఫారాల్లోకి కొత్త వ్యక్తులను రానీయొద్దంటూ సూచనలు జారీ చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని అధికారులు చెప్తున్నారు. వీటిపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో కొద్ది నెలల క్రితం వ్యాధి వచ్చిన మాట వాస్తవమే. ప్రస్తుతం జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎక్కడా లేదు. వ్యాధి ప్రబలకుండా ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయి. ఎలాంటి ఆందోళన అక్కర్లేదు.
– చైతన్యకిశోర్, ఏడీ, జిల్లా పశువైద్య నిర్ధారణ ప్రయోగశాల
జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ ఇబ్బందుల్లేవు. ఉభయగోదావరి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిసింది. ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భయపడాల్సిన అవసరం లేదు.
– వెంకటరమణయ్య,
బ్రాయిలర్ ఫార్మర్స్ అసోసియేషన్
ఆందోళన వద్దు
ఆందోళన వద్దు
Comments
Please login to add a commentAdd a comment