మమ్మల్ని ఆదుకోండి సారూ..
● ఎస్పీ కృష్ణకాంత్‌కు బాధితుల మొర
● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 93 ఫిర్యాదులు
నెల్లూరు(క్రైమ్): నమ్మించి మోసం చేశారు.. న్యాయం చేయాలని బాధితులు ఎస్పీ జి. కృష్ణకాంత్‌ను కోరారు. సోమవారం స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 93 మంది తమ సమస్యలపై ఎస్పీకి వినతులు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసుస్టేషన్, ఆత్మకూరు డీఎస్పీలు చెంచురామారావు, వేణుగోపాల్‌రావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఉద్యోగం ఇప్పిస్తానని..
సాఫ్ట్‌వేర్ జాబ్ (వర్క్ ఫ్రమ్ హోమ్) ఉద్యోగాలు ఇప్పిస్తానని పొదలకూరుకు చెందిన ఎన్. భగవాన్ అనే వ్యక్తి నమ్మించి ఒక్కొక్కరి వద్ద రూ.1.60 లక్షలు తీసుకున్నాడు. దీంతోపాటు ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి మాకు తెలియకుండా ఒక్కొక్కరి పేరుపై రూ.3 లక్షలు లోన్ తీసుకుని నకిలీ జాబ్ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లు ఇచ్చాడు. నగదు తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడు. విచారించి న్యాయం చేయాల ని నెల్లూరు బాలాజీనగర్, కోవూరు, గుడ్లూరు, బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన పలువురు కోరారు.
రూ 1.25 లక్షలు తీసుకుని..
తన కుమారుడికి వెటర్నరీ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన నూర్జాహాన్ రూ.1.25 లక్షలు తీసుకుంది. నెలలు గడుస్తున్నా.. ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఆమెను నిలదీయగా సమాధానం దాటేస్తుంది. తగిన చర్యలు తీసుకోవాలని బాలాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి కోరారు.
● నా పేరుపై ఉన్న స్థలం పత్రాలు తీసుకుని పెద్ద కొడుకు వేధిస్తున్నాడని, విచారించి న్యాయం చేయాలని నెల్లూరు రూరల్‌కు చెందిన ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేసింది.
● భూ వివాదంపై తిరుపాల్, కిశోర్, రమణమ్మ తమపై దాడిచేశారు. మాకు తీవ్రగాయాలయ్యాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మాపైనే కేసుల నమోదు చేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు మండలం బండారుపల్లికి చెందిన బాధితులు కోరారు.
● మా అమ్మమ్మ ఆత్మకూరు బస్టాండు సమీపంలో పూల వ్యాపారం చేస్తోంది. గుర్తుతెలియని ఇద్దరు యువకులు ఆమైపె దాడిచేశారని, ఆమె ఒంటిపై కాల్చిన గాయాలున్నాయి. వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరుకు యువకులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment