
21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 21వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి జెడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు సీఈఓ విద్యారమ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక ప్రణాళిక, గృహ నిర్మాణ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర వాటిపై సమీక్షలు ఉంటాయన్నారు. జెడ్పీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సమావేశాలు జరుగుతాయని తెలియజేశారు.
1.71 లక్షల మంది రైతులకు
యూనిక్ ఐడీలు
● జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి
మనుబోలు: జిల్లాలోని 1,71,500 మంది రైతులకు యూనిక్ ఐడీ (విశిష్ట సంఖ్య) నమోదు చేయడమే లక్ష్యమని జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి తెలిపారు. మండలంలోని జట్ల కొండూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వరి పొలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి రైతు యూనిక్ ఐడీ కలిగి ఉండాలన్నారు. దీని ద్వారానే ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో నెలాఖరులోపు యూనిక్ ఐడీని నమోదు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో 297 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే రైతులందరూ ఈకేవైసీ, ఈ–క్రాప్ నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ శివనాయక్, నర్సోజిరావు, ఏఓ జహీర్, ఏఏఓ కళారాణి తదితరులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో
రౌడీషీటర్ వీరంగం
నెల్లూరు(క్రైమ్): మద్యం మత్తులో ఓ రౌడీషీటర్ తన స్నేహితుడితో కలిసి వీరంగం సృష్టించిన ఘటన నెల్లూరు పొదలకూరురోడ్డులోని ఓ వైన్‌షాపు వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. నగరానికి చెందిన ఓ రౌడీషీటర్ తన స్నేహితుడితో కలిసి మంగళవారం వైన్ షాపునకు వెళ్లారు. పక్కనే ఉన్న కూల్‌డ్రింక్ షాపులో ఫూటుగా మద్యం తాగారు. సాయంత్రం బయటకు వచ్చిన వారు మద్యం మత్తులో వీరంగం చేశారు. ఓ యువకుడిపై దాడి చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న దర్గామిట్ట ఎస్సై రమేష్‌బాబు తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మందుబాబులు పరారయ్యారు. దీంతో వారికోసం గాలిస్తున్నారు.
న్యాయసేవ సహాయకుల
పోస్టుల భర్తీకి చర్యలు
నెల్లూరు(అర్బన్): జిల్లా న్యాయసేవాధికార సంస్థ నెల్లూరు, మండల న్యాయసేవాధికార సంస్థ కమిటీలైన గూడూరు, కోవూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, కోట, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఉదయగిరిల్లో పారా లీగల్ వలంటీర్లు (న్యాయసేవ సహాయకులు)గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్, ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు నిండి ఇంటర్ ఆపైన విద్యార్హతలు గల వారు రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాలన్నారు. ఒక సంవత్సర కాలపరిమితితో భర్తీ అయ్యే ఈ పోస్టులకు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు నిర్ధారించిన గౌరవ వేతనాన్ని అందిస్తామన్నారు. దరఖాస్తులను చైర్మన్ కం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయసేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్టు కాంపౌండ్, నెల్లూరు చిరునామాకు ఈనెల 25వ తేదీలోగా పంపాలని కోరారు. రిజిస్టర్ పోస్టుపై అప్లికేషన్ ఫర్ ఎంపానెల్‌మెంట్ ఆఫ్ పారా లీగల్ వలంటీర్స్ అని రాయాలన్నారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించాలని కోరారు. ప్రజలకు చట్టపరంగా న్యాయసహాయం అందించేందుకు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడీ సేవకులు, లా డిగ్రీ చదవుతున్న విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
గరుడ వాహనంపై
నృసింహుడి ఊరేగింపు
రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వా మి చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వాతి నక్షత్రం శ్రీవారి జన్మ నక్షత్రం కావడంతో మంగళవారం మూలమూర్తికి చందనంతో అలంకారం చేసినట్లుగా అర్చకులు తెలిపారు. సాయంత్రం బంగారు గరుడ వాహనంపై లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి మేళతాళాల నడుమ కోన మాడవీధుల్లో ఊరేగించారు.

21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
Comments
Please login to add a commentAdd a comment