
మన్నేరులో ఇసుక దొంగలు
గుడ్లూరు: కూటమి ప్రభుత్వంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. మండలంలోని దారకానిపాడు సమీపంలో ఉన్న మన్నేరులో టీడీపీ నాయకులు జేసీబీల ద్వారా ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. దారకానిపాడు సమీపంలో డంపింగ్ చేసి అర్ధరాత్రి వేళల్లో మండలంలోని చుట్టుపక్కల ఉన్న వారికి, కందుకూరు పట్టణానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తంతు ఆరునెలల నుంచి సాగుతోంది. కాగా టీడీపీలోని రెండు వర్గాలు ఇసుక తరలింపుపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వర్గం ఇటీవల కందుకూరు సబ్ కలెక్టర్‌కు తిరుమణిశ్రీ పూజకు ఈ దోపిడీ గురించి అర్జీ ఇచ్చింది.
నాలుగు ట్రాక్టర్లలో..
సోమవారం సాయంత్రం నాలుగు ట్రాక్టర్లలో ఇసుక నింపి కందుకూరు ప్రాంతానికి తరలించారు. ఈ విషయమై గ్రామస్తులు సబ్ కలెక్టర్‌కు సమాచారమిచ్చారు. దీంతో ఆమె దారకానిపాడు గ్రామానికి చేరుకున్నారు. ఇంతలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాయకుడికి కొందరు సమాచారం అందించారు. వాహనాల లైట్ల ఫోకస్ చూసి జేసీబీ డ్రైవర్ అప్రమత్తమై జామాయిల్ తోటలోకి తీసుకెళ్లినట్లు సమాచారం. మన్నేరు నుంచి దారకానిపాడు గ్రామంలోకి రావడానికి ప్రత్యామ్నాయ మార్గం లేక స్కూటీ, ట్రాక్టర్, కారు యజమానులు సబ్ కలెక్టర్ వాహనాన్ని చూసి పరారయ్యారు. ఆమె స్థానిక వీఆర్వోకి మూడు వాహనాలను స్వాధీనపరిచి పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆదేశించారు.
కేసు నమోదు
మన్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు గుడ్లూరు ఎస్సై పి.వెంకట్రావు మంగళవారం తెలిపారు. స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు మూడు వాహనాలపై కేసు నమోదు చేశామన్నారు.
మన్నేరులో ఇసుక డంపింగ్
జోరుగా తవ్వకాలు
దారకానిపాడు సమీపంలో డంపింగ్
కూటమి నాయకుల్లో విభేదాలు

మన్నేరులో ఇసుక దొంగలు
Comments
Please login to add a commentAdd a comment