ఇన్సులిన్‌కూ కటకటే..! | - | Sakshi
Sakshi News home page

ఇన్సులిన్‌కూ కటకటే..!

Published Thu, Feb 20 2025 12:05 AM | Last Updated on Thu, Feb 20 2025 12:05 AM

ఇన్సు

ఇన్సులిన్‌కూ కటకటే..!

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని కూటమి ప్రభుత్వం తరచూ ఊదరగొడుతున్నా, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అదంతా ఒట్టిదేనని తేలిపోతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఆధారపడే ఇన్సులిన్‌ వైల్స్‌ సరఫరాలో నిర్లక్ష్య ధోరణిని కనబరుస్తోంది. పీహెచ్‌సీలకు ఐదు నెలలుగా వీటి సరఫరా నిలిచిపోయిందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని సిబ్బందే నిర్ధారిస్తుండటం గమనార్హం.

ఆత్మకూరు: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని కనబరుస్తోంది. పెద్దాస్పత్రి, పీహెచ్‌సీలకు ఇన్సులిన్‌ వైల్స్‌ ఐదు నెలలుగా సరఫరా కావడంలేదు. వాస్తవానికి షుగర్‌ వ్యాధి తీవ్రమైతే దీన్ని వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి సంబంధించిన మందులు ఖరీదు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వాస్పత్రులపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. దీంతో జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాల్లోని ఆస్పత్రులకు అన్ని రకాల మందులు సక్రమంగా సరఫరా అయ్యేవి. ఇన్సులిన్‌ వైల్స్‌ తగినంత అందుబాటులో ఉండేవి.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో అర్బన్‌ హెల్త్‌ కేంద్రాలు 25, పీహెచ్‌సీలు 52 ఉన్నాయి. నెల్లూరులో జీజీహెచ్‌, ఆత్మకూరులో ప్రభుత్వ జిల్లా వైద్య కేంద్రం, కావలి, కందుకూరులో ప్రాంతీయ వైద్య కేంద్రాలు, ఉదయగిరి, వింజమూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు, కోవూరు, రాపూరు ప్రాంతాల్లో సీహెచ్‌సీలున్నాయి. వీటికి మందులు ఏపీఎంఐడీఎస్‌ నుంచి సరఫరా అవ్వాలి. జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు చేరితే అక్కడి నుంచి మండలాలకు సరఫరా చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో పీహెచ్‌సీలకు మందుల సరఫరాను తగ్గించారని సమాచారం.

మందుల సరఫరా ఇలా..

వివిధ రోగాలకు సంబంధించిన మందులను ఏడాదిలో నాలుగుసార్లు సరఫరా చేస్తారు. పేషెంట్ల తాకిడిని బట్టి ఒక్కో పీహెచ్‌సీకి రూ.50 వేల నుంచి రూ.3.5 లక్షల విలువగల 84 రకాల నుంచి 172 రకాల మందులు సరఫరా అవుతాయి. ఏరియా, జీజీహెచ్‌ లాంటి కేంద్రాలకు రూ.15 లక్షల విలువగల మందులను సరఫరా చేస్తారు.

ఆన్‌లైన్లోనే ఇండెంట్‌ ప్రక్రియ

ఆయా పీహెచ్‌సీల పరిధిలోని షుగర్‌ పేషెంట్ల వివరాల మేరకు.. గతంలో పంపిణీ చేసిన షుగర్‌ వైల్స్‌ను దృష్టిలో ఉంచుకొని కావాల్సిన మేరకు ఇండెంట్‌ను ఫార్మసిస్ట్‌లు పెడతారు. ఇలా ఒక్కో పీహెచ్‌సీ కేంద్రంలో 300 నుంచి 500 వరకు షుగర్‌ వైల్స్‌ను ఇండెంట్‌లో నమోదు చేస్తారు. ఈ వ్యవహారమంతా ఆన్‌లైన్‌ ద్వారానే జరగాల్సి ఉంది. ఒక్కో వైల్‌లో 10 ఎమ్మెల్‌ ఇన్సులిన్‌ ఉంటుంది. వైల్స్‌లోనూ 30 / 70.. 40 ఐయూ ఇలా రెండు రకాలుంటాయి. అయితే ఇండెంట్‌లో ఇన్సులిన్‌ అనే కాలమ్‌ను తాజాగా ఎత్తేశారని సమాచారం. దీంతో రానున్న త్రైమాసికంలో దీని సరఫరా నిలిచిపోనుందని తెలుస్తోంది. కొన్ని పీహెచ్‌సీల్లో వైల్స్‌ పూర్తవ్వడంతో సమీప కేంద్రాల నుంచి తెచ్చుకొని అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిబ్బంది పేర్కొంటున్నారు.

కొనుగోలు భారం

పీహెచ్‌సీల్లో వైల్స్‌ కొరత కారణంగా రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఇన్సులిన్‌ 10 ఎమ్మెల్‌ను రూ.150 నుంచి రూ.170 వరకు విక్రయిస్తున్నారు. వీటి సరఫరాను పునరుద్ధరించాలని రోగులు కోరుతున్నారు. కాగా ఈ విషయమై ఎడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీని సంప్రదించగా, ఫార్మసిస్ట్‌లు నమోదు చేసే ఇండెంట్‌ మేరకు సరఫరా అవుతోందని చెప్పారు. ఈ త్రైమాసికంలో ఇన్సులిన్‌ సరఫరా కాని విషయాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని బదులిచ్చారు.

పీహెచ్‌సీలకు ఐదు నెలలుగా నిలిచిన సరఫరా

ఆన్‌లైన్లో ఇండెంట్‌ కాలమే ఎత్తివేత

ప్రజారోగ్యాన్ని విస్మరిస్తున్న

కూటమి ప్రభుత్వం

ప్రైవేట్‌గా కొనుగోలు చేసుకోవచ్చు

ఆస్పత్రిలో ఇన్సులిన్‌ వైల్స్‌ తగినంత ఉన్నాయి. అవకాశం బట్టి ప్రైవేట్‌గా కొనుగోలు చేయొచ్చు. అయితే ఇప్పటి వరకు ఆ పరిస్థితే రాలేదు. ఫార్మసిస్ట్‌లు నమోదు చేసే ఆన్‌లైన్‌ కాలమ్‌ను పరిశీలిస్తా. పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూస్తా.

– శేషారత్నం, ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ఇన్సులిన్‌కూ కటకటే..! 1
1/1

ఇన్సులిన్‌కూ కటకటే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement