
విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు
నెల్లూరు(బారకాసు): అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. డైకస్‌రోడ్డులోని ఎన్జేఆర్ భవన్‌లో విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యమిచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు – నేడు కింద తీర్చిదిద్దడంతో బడిబాట పట్టే పిల్లల సంఖ్యా పెరిగిందని చెప్పారు. వీటిని చూసి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే ఇప్పుడు డేటా అవసరమంటూ ఆ విషయాన్ని దాటేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వృద్ధి రేటు 15 శాతానికి చేరితేనే అన్ని పథకాలను అమలు చేస్తామంటున్నారని, అవి అందే పరిస్థితి లేదనే విషయం దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. పిల్లల చదువుకు గండికొట్టడం సరికాదని హితవు పలికారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎందుకు ఇవ్వాలనే ధోరణిలో మంత్రి లోకేశ్ ఉన్నారన్నారు. 2019 నాటికి అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన దాదాపు రూ.రెండు వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చెల్లించిందని తెలిపారు. పాఠశాల.. కళాశాల విద్యను అనుసంధానం చేసేందుకు బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ను ఏర్పాటు చేశారని, ఈ కారణంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. విద్యారంగాన్ని ప్రస్తుతం భ్రష్టు పట్టిస్తున్నారని, విద్యార్థుల్లేకుండా విజన్ – 2047ను ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నాలుగు విడతల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాల్సి ఉందని, ఒక్క విడతా.. అదీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ఆరోపించారు. ప్రైవేట్ రంగానికి లబ్ధి చేకూరుస్తారే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ పనినీ చంద్రబాబు చేయరని ధ్వజమెత్తారు. హెరిటేజ్ లాభాల్లో ఉండగా, ప్రభుత్వ రంగానికి చెందిన విజయ డెయిరీ నష్టాల్లో ఉందనే అంశాన్ని దీనికి ఉదాహరణగా చూపారు.
కూటమి ప్రభుత్వంపై మండిపడిన
నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment