
పకడ్బందీగా రీసర్వే చేయండి
సంగం: మండలంలోని కొరిమెర్ల కండ్రికలో జరుగుతున్న రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ కె.కార్తీక్ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. బుధవారం రీసర్వే జరుగుతున్న తీరును పరిశీలించి, తహసీల్దార్ సోమ్లానాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ భూములకు సంబంధించిన రైతులతో మాట్లాడారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 35 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నామన్నారు. భూములకు సంబంధించిన పట్టాదారులకు నోటీసులు అందజేసి రీసర్వే ప్రక్రియను జరపాలన్నారు. జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ భూమిరెడ్డి పావని, డీఎస్‌ఎల్‌ఓ నాగశేఖర్, సర్వేయర్ శివరంజని, ఆర్‌ఐ సల్మా, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓగా మల్లికార్జునరెడ్డి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఐటీడీఏ పీఓగా మల్లికార్జునరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఆయనకు అడిషనల్ డైరెక్టర్‌గా తాత్కాలిక పదోన్నతిని కల్పిస్తూ నెల్లూరు ఐటీడీఏ పీఓగా ఉత్తర్వులను ఇచ్చారు.
నేడు లంకా దినకర్ రాక
నెల్లూరు(అర్బన్): ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ గురువారం రాత్రి నెల్లూరుకు వస్తారని జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ డీడీ సదారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21వ తేదీ జిల్లా అధికారులతో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం అమలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారన్నారు.
డాక్టర్ విజయకుమార్ రాక రేపు
మాల సంక్షేమ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయకుమార్ ఈ నెల 21న నెల్లూరుకు చేరుకుని రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22వ తేదీ సంబంధితశాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం కలెక్టర్‌తో సమావేశమవుతారు.
ఆర్‌పీ సిసోడియా రాక రేపు
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా శుక్రవారం నెల్లూరుకు రానున్నారు. అధికారులతో రెవెన్యూ సమస్యలపై చర్చిస్తారు.
మితిమీరిన టీడీపీ
నేతల అరాచకాలు
● ప్రజా సంక్షేమం గాలికి
● అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మేస్తున్నారు
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
శ్రీనివాసరావు ధ్వజం
నెల్లూరు (వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు, అరాచకాలు ఎక్కువయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతోందని విమర్శించారు. నెల్లూరులోని సీపీఎం జిల్లా కార్యాలయంలో బుధవా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోలార్ విద్యుత్ పేరుతో ఒప్పందం చేసుకుని రైతుల నుంచి తీసుకున్న భూములను అదానీకి కట్టబెట్టిందని, ఇది చాలదన్నట్టుగా యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని యూనిట్ విద్యుత్‌ను రూ.4.23 కొనేందుకు సిద్ధపడిందన్నారు. ఈ ఒప్పందంలో భారీగా ముడుపులు దండుకున్నారని ఆరోపించారు. దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా చూస్తూ హిందూ మతాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని రిమ్స్‌లో రేడియోలజీ విభాగంలో మతం ప్రాదిపదికన నియామకాలు జరపాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ మూతపడిన కారణంగా 400 మంది ఉద్యోగులు వారి కుటుంబాలు వీధిన పడ్డాయని, వారికి చెల్లించాల్సిన రూ.23 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్లను టీడీపీ నేతలు నరికి విక్రయాలు సాగిస్తున్నా.. అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వరికుంటపాడు అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్లను నరికిన విషయమై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకులపై దాడి చేసిన టీడీపీ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, అజయ్‌కుమార్, వెంగయ్య, మంగలి పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా రీసర్వే చేయండి
Comments
Please login to add a commentAdd a comment