ఉద్యోగాల పేరుతో టోకరా | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో టోకరా

Published Sat, Mar 1 2025 7:53 AM | Last Updated on Sat, Mar 1 2025 7:54 AM

ఉద్యోగాల పేరుతో టోకరా

ఉద్యోగాల పేరుతో టోకరా

నెల్లూరు(అర్బన్‌): అతను అటెండర్‌ స్థాయి ఉద్యోగి. రాష్ట్ర ఉన్నతాధికారుల పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో (పెద్దాస్పత్రి) నియమిస్తూ ఉద్యోగ ఉత్తర్వులు కూడా అందజేశాడు. వాటిని నిజమైనవిగా భావించిన నిరుద్యోగులు పెద్దాస్పత్రికి వెళ్లారు. తీరా తాము మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. మోసం చేసింది ఎవరో కాదు.. పెద్దాస్పత్రిలో సర్జికల్‌ విభాగంలో అటెండర్‌గా ఉద్యోగం చేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగి మురళి.

నెల్లూరు పొదలకూరు రోడ్డులో నివసిస్తున్న జాన్‌ అనే వ్యక్తి కొత్తూరు వద్ద కరెంటాఫీస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఇటీవల రిటైరయ్యారు. పెద్దాస్పత్రిలో పనిచేసే మురళి ఆయనతో పరిచయం పెంచుకున్నాడు. ఆరు నెలల క్రితం జాన్‌ కుమార్తె షారోన్‌ మాధురికకు ల్యాబ్‌ టెక్నీషియన్‌గా కాంట్రాక్ట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తే సరిపోతుందని నమ్మబలికాడు. జాన్‌ పలుదఫాలుగా ఫోన్‌పే ద్వారా మురళికి నగదు పంపాడు. అలాగే తన తమ్ముడు కుమార్తె హారికకు ఉద్యోగం కోసం రూ.75 వేల వరకు మురళికి ఇప్పించాడు. డబ్బులిచ్చాక ఉద్యోగం ఎక్కడని ప్రశ్నించడంతో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికారి పేరుతో దొంగ సంతకం చేసి 2024 నంబర్‌ ఒకటో తేదీన ఉద్యోగమిస్తూ అపాయింట్‌మెంట్‌ ఉత్తర్వులిచ్చాడు. మొత్తం 8 మందికి ఉద్యోగాలిస్తూ ఫేక్‌ లెటర్లు ఇచ్చాడు. వాటిని నిజమని నమ్మి పెద్దాస్పత్రికి వెళ్లగా ఇక్కడ ఖాళీల్లేవని ఎవరో మోసం చేశారని అధికారులు చెప్పడంతో అప్పటికి గాని తాము మోసపోయినట్టు జాన్‌ సోదరులకు తెలియలేదు. దీంతో వారు డబ్బుల కోసం మురళిపై ఒత్తిడి తెచ్చారు. అతను తప్పించుకుని తిరగడంతో నాలుగో నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మురళిని పిలిపించారు. అతని తల్లి అక్కడకు వచ్చి తన బిడ్డను వదిలేయాలని, ఆ డబ్బు తాను చెల్లిస్తానని బతిమాలుకుంది. దీంతో జాన్‌ సోదరులు రాజీపడి డబ్బుల కోసం ఎదురు చూడసాగారు. స్పందన లేకపోవడంతో మురళి కోసం శుక్రవారం జాన్‌ పెద్దాస్పత్రికి వచ్చాడు. మోసాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలిపాడు.

ఎనిమిది మందికి..

ఆరుగురికి జూనియర్‌ అసిస్టెంట్లుగా, ఒకరికి ల్యాబ్‌ టెక్నీషియన్‌గా, మరొకరికి అటెండర్‌గా మురళి ఉత్తర్వులిచ్చాడు. అందులో రిజర్వేషన్‌, ఆధార్‌ నంబర్లు, జీతం స్కేల్‌ పొందుపరుస్తూ దొంగ ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. వారిలో ఎస్‌కే రేష్మ, కె.కలీమ్‌, ఎస్‌కే వశీం అహ్మద్‌, ఎ.షారోన్‌ మాధురిక, కామాటి అనూష, జొన్నవాడ షాలీము, ఎం.నాగసుమతి, టి.నరేంద్ర తదితరులున్నారు. తమను మోసం చేశాడని తెలుసుకున్న కొంతమంది నిరుద్యోగులు మురళిపై ఒత్తిడి తెచ్చి డబ్బు తిరిగివ్వాలని డిమాండ్‌ చేయసాగారు. మరో వైపు ఈ కథ పోలీసులకు చేరింది. దీంతో మురళి పెద్దాస్పత్రి విధులకు రావడం మానేశాడు. తప్పించుకుని తిరుగుతున్నాడు. అమాయకులను మోసం చేసి సుమారు రూ.15 లక్షల వరకు దండుకున్నాడనే ప్రచారం పెద్దాస్పత్రిలో జరుగుతోంది.

నకిలీ ఉత్తర్వుల అందజేత

ఏకంగా డీఎంఈ సంతకం ఫోర్జరీ

ఒక్కో ఉద్యోగానికి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వసూలు

పెద్దాస్పత్రిలోని ఓ చిరుద్యోగి నిర్వాకం

పోలీసులకు బాధితుల ఫిర్యాదు

విచారణ చేస్తున్నాం

ఉద్యోగాలు కల్పిస్తామంటూ డబ్బులు వసూలు చేయడం, డీఏంఈ పేరుతో దొంగ ఉత్తర్వులు సృష్టించినట్టు ఫిర్యాదు అందింది. విచారణ చేస్తున్నాం. డిప్యూటీ కలెక్టర్‌ మహేశ్వరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. – డాక్టర్‌ సిద్ధానాయక్‌, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement