విధుల నుంచి ఇద్దరు ఎఫ్‌ఎన్‌ఓల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

విధుల నుంచి ఇద్దరు ఎఫ్‌ఎన్‌ఓల తొలగింపు

Published Sat, Mar 1 2025 7:53 AM | Last Updated on Sat, Mar 1 2025 7:54 AM

విధుల

విధుల నుంచి ఇద్దరు ఎఫ్‌ఎన్‌ఓల తొలగింపు

నెల్లూరు(అర్బన్‌): జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేస్తూ దొంగతనానికి పాల్పడి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరు ఎఫ్‌ఎన్‌ఓలను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ డీఎంహెచ్‌ఓ వి.సుజాత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. యల్లాయపాళెం పీహెచ్‌సీ ఎఫ్‌ఎన్‌ఓ దార్ల జీవిత, సర్వాయపాళెం పీహెచ్‌సీ ఎఫ్‌ఎన్‌ఓ వాసుకిలు ఆప్కాస్‌లో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ కోవూరు మండలం పాటూరు రోడ్డులో గురువారం రాత్రి ఓ వృద్ధురాలి నుంచి బంగారు చైన్‌ చోరీ చేస్తూ పట్టుపడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. అందువల్ల వీరిని ఉద్యోగాల నుంచి తొలగించామని తెలిపారు.

న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ

నెల్లూరు(లీగల్‌): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వకేట్‌ యాక్ట్‌ 2025 బిల్లును వ్యతిరేకిస్తూ నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త బిల్లును పునః పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. న్యాయవాదులందరు తమ ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని కోరారు. బార్‌ అధ్యక్షుడు ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులూ.. విజయీభవ

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

79 కేంద్రాల ఏర్పాటు

నెల్లూరు(టౌన్‌): ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 79 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులను అరగంట ముందుగా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 53,200 మంది హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 28,176 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 25,024 మంది ఉన్నారు. కోవూరు, తోటపల్లిగూడూరు, బిట్రగుంట, మర్రిపాడు, ఆత్మకూరు, ఉదయగిరి, రావూరు, కుల్లూరు, చేజర్ల, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. హాల్‌టికెట్లను బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని హాజరుకావొచ్చు. దానిపై సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ సంతకం ఉండాల్సిన అవసరం లేదు. విద్యార్థుల సమస్యలు, ఇబ్బందుల కోసం కంట్రోలు రూమ్‌ను ఏర్పాటు చేశారు. 0861 – 2320312 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలి. మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా నాలుగు ఫ్లయింగ్‌, 5 సిటింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. 1,400 మందికి పైగా ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు సూచించారు.

నేడు పింఛన్ల పంపిణీ

నెల్లూరు (పొగతోట): సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం జిల్లా వ్యాప్తంగా 3,07,232 మంది లబ్ధిదారులకు రూ.132 కోట్ల నగదును పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి సచివాలయాల ద్వారా నగదును సిబ్బందికి అందజేశారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఉదయం నుంచి నగదు పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నారు.

ఇసుక మోసిన విద్యార్థులు

దుత్తలూరు: దుత్తలూరులోని ఏపీ మోడల్‌ పాఠశాలలో శుక్రవారం విద్యార్థుల చేత ఇసుక బస్తాలు మోయించారు. స్కూల్లో సరస్వతీదేవి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరుబయట ఉన్న ఇసుకను బస్తాల్లోకి నింపి లోపలికి మోయించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి ప్రిన్సిపల్‌ సైమన్‌రావును వివరణ కోరగా తాము విద్యార్థులకు ఎటువంటి పని చెప్పలేదని, వారే స్వయంగా తీసుకొచ్చారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విధుల నుంచి ఇద్దరు  ఎఫ్‌ఎన్‌ఓల తొలగింపు1
1/1

విధుల నుంచి ఇద్దరు ఎఫ్‌ఎన్‌ఓల తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement