
కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: కూటమి ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కసుమూరు గ్రామంలో సోమవారం ఆయన రైతులతో కలిసి ధాన్యం రాసులను పరిశీలించారు. పంటకు మద్దతు ధర లేదని, కొనుగోలు కేంద్రాల్లో గింజ కొనడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గోవర్ధన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలియజేశారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యం 16 లక్షల పుట్లు మార్కెట్‌లోకి వస్తే రూ.400 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అధికారులు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ ఆర్భాటంగా ప్రకటించినా, క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రాల్లో గోనెసంచులు, కొనుగోలు చేసే సిబ్బంది కనిపించడం లేదన్నారు. మద్దతు ధర లేనికారణంగా ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోతున్నారని మండిపడ్డారు. బడ్జెట్‌లో మద్దతు ఽధర కోసం కేవలం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారని, గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించినట్లు చెప్పారు. నాడు పుట్టి ధర రూ.23 వేల నుంచి రూ.28 వేల వరకు పలకడంతో రైతులు సంతోషంగా పంటను అమ్ముకున్నారని గుర్తు చేశారు.
దోచుకోవడంపైనే సోమిరెడ్డి దృష్టి
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి దోచుకోవడంపైనే దృష్టి పెట్టారని కాకాణి విమర్శించారు. ఆయన ప్రజలు, రైతుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సాగునీటి కాలువల్లో పనులు చేయకుండానే బిల్లులు చేసుకుని నిధులు స్వాహా చేశాడన్నారు. రైతుల్ని ఆదుకోవాలని కూటమి నేతలు గ్రీవెన్స్‌డేకు వెళ్లి జిల్లా అధికారులను కోరుతున్నట్లు చెప్పారు. దీనిని చూసిన ప్రజలకు ఈ ప్రభుత్వ చేతగానితనం స్పష్టమైందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి, మద్దతు ధర కల్పించి, నష్టపోయిన రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర కోసం వైఎస్సార్‌సీపీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్‌నాయుడు, విజయభాస్కర్‌నాయుడు, హుస్సేన్, చీకుర్తి నరసయ్య, గుర్రం పుట్టయ్య, సర్పంచ్ కడివేటి శివ, ఉపసర్పంచ్ బాబర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment