‘పది’ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం | - | Sakshi
Sakshi News home page

‘పది’ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

Published Sat, Mar 8 2025 12:01 AM | Last Updated on Sat, Mar 8 2025 12:01 AM

‘పది’ విద్యార్థులకు  ఉచిత బస్సు సౌకర్యం

‘పది’ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

నెల్లూరు సిటీ: ఈనెల 17 నుంచి 31వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పి స్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను చూసి ప్రయాణం చేయొచ్చని స్థానిక అధికారులు తెలిపారు.

ఇంటర్‌ పరీక్షలకు

511 మంది గైర్హాజరు

నెల్లూరు(టౌన్‌): ఇంటర్మీడియట్‌ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 511 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌కు సంబంధించి 23,575 మందికి గానూ 23,106 మంది ఎగ్జామ్స్‌ రాశారు. 469 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 994 మందికి గానూ 952 మంది హాజరయ్యారు. 42 మంది గైర్హాజరయ్యారు.

సంస్కృత జవాబుపత్రాల

మూల్యాంకనం ప్రారంభం

నెల్లూరు(టౌన్‌): నెల్లూరులోని కేఏసీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి సంస్కృతం జవాబుపత్రాల మూల్యాంకనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆర్‌ఐఓ శ్రీనివాసులు చీఫ్‌, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లతో సమావేశం నిర్వహించి పొరబాట్లకు తావు లేకుండా మూల్యాంకనం చేయాలన్నారు. సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో కేఏసీ ప్రిన్సిపల్‌ శ్రీనివాసులురెడ్డి, సౌత్‌మోపూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

13న వాహనాల వేలం

నెల్లూరు(టౌన్‌): జిల్లా రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడి ఎలాంటి పత్రాల్లేకుండా సీజ్‌ చేసిన 17 వాహనాలను ఈనెల 13వ తేదీన వేలం వేయనున్నట్లు డీటీసీ చందర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు రూ.5 వేలు డిపాజిట్‌ను చెల్లించాలన్నారు. వాహనాన్ని పాడుకున్న వారు వేలంలో దక్కించుకున్న మొత్తానికి 18 శాతం జీఎస్టీ, నిర్దేశిత పార్కింగ్‌ ఫీజు చెల్లించాలన్నారు. వేలం రోజే బిడ్‌ రూపంలో సగం మొత్తాన్ని కార్యాలయంలో కట్టాలన్నారు. మిగిలిన మొత్తాన్ని ఈనెల 24వ తేదీలోపు చెల్లించాలన్నారు. వేలంలో పాల్గొనే సభ్యులు జీఎస్టీ నంబర్‌ను కలిగి ఉండాలన్నారు.

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు 2,945 మంది హాజరు

నెల్లూరు(టౌన్‌): ఏపీ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 318 మంది అభ్యాసకులు గైర్హాజరయ్యారు. 3,263 మందికి గానూ 2,945 మంది హాజరయ్యారు. కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌ సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి.

రైలు ఢీకొని

యువకుడి మృతి

నెల్లూరు(క్రైమ్‌): రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సౌత్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై శుక్రవారం జరిగింది. మృతుడి వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. పసుపు రంగు ఫుల్‌హ్యాండ్స్‌ చొక్కా, బ్లూ రంగు జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. కుడిచేతిపై అమ్మ.. సంజీవమ్మా అనే పచ్చబొట్టు ఉంది. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై జి.మాలకొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగుదేశం

నాయకుల దౌర్జన్యం

వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడి సొంత స్థలంలో సీసీ రోడ్డు నిర్మాణం

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

వెంకటాచలం: మండలంలోని ఇడిమేపల్లి పంచాయతీ పరిధిలో జంగాలపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన పచ్చికాల శీనయ్య సొంత స్థలంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనిపై బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శీనయ్యకు చెందిన సర్వే నంబర్‌ 531 – 2లో 21 అంకణాల స్థలంలోని ప్రహరీని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా కూల్చేశారు. దీనిపై బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇటీవల ఆ భూమిలో సీసీ రోడ్డు వేసేందుకు చదును చేయగా శీనయ్య కలెక్టర్‌, ఎస్పీ, రూరల్‌ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఇటీవల గ్రామానికి పోలీసులు, పంచాయతీ అధికారులు వచ్చి పరిశీలించారు. కానీ గురువారం ఆ స్థలంలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా రోడ్డు వేశారని శీనయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయమై ఎంపీడీఓ కల్పనను వివరణ కోరగా ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని, రోడ్డు నిర్మాణ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement