నెల్లూరు(క్రైమ్): మీ పిల్లలు మలేసియాలో చిక్కుకుపోయారని తెలిసి సీఎం కార్యాలయం నుంచి వచ్చానని దంపతులను ఓ వ్యక్తి నమ్మించాడు. పిల్లలను స్వదేశానికి తీసుకొస్తానని రూ.50 వేలు తీసుకుని ఉడాయించిన ఘటనపై నెల్లూరు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. తెగచర్ల గ్రామానికి చెందిన జయమ్మ, పెద్దయ్య దంపతులు ప్రస్తుతం హరనాథపురంలో ఉంటున్నారు. వారి కుమారుడు సింహాద్రి ఇంటర్మీడియట్ వరకు చదివాడు. మలేసియాలోని హోటల్లో పనిచేస్తే ఎక్కువ డబ్బులొస్తాయని ఓ ఏజెంట్ సింహాద్రిని, అతని తల్లిదండ్రులను నమ్మించాడు. దీంతో వారు రూ.50 వేలు అతడికి ఇచ్చారు. సింహాద్రితోపాటు అతని పెదనాన్న కుమారుడు పవన్‌ను గతేడాది జూన్‌లో మలేసియాకు పంపారు. ఏజెంట్ వర్క్ పర్మిట్ అని వారిని నమ్మించి టూరిస్ట్ వీసా ఇవ్వడంతో ఇటీవల సింహాద్రి, పవన్‌ను మలేసియా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని స్వదేశానికి రప్పించాలంటూ ఇటీవల పెద్దయ్య, జయమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి తాను సీఎం కార్యాలయం నుంచి వచ్చానని జయమ్మ, పెద్దయ్యను కలిశాడు. మీ గ్రామంలో మీ పిల్లల గురించి ఆరాతీయగా వారిపై ఎలాంటి కేసులు లేవని తేలిందన్నాడు. కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. కలెక్టర్‌తో మాట్లాడి వస్తానని వారిని బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్లాడు. కొద్దిసేపటి అనంతరం బయటకు వచ్చినతను అంతా మాట్లాడానని సింహాద్రి, పవన్‌లను తీసుకొచ్చేందుకు విమాన టికెట్లు, ఇతర ఖర్చులు రూ.60 వేల వరకు అవుతాయని చెప్పాడు. తాము అంత ఇవ్వలేమని బాధిత తల్లిదండ్రులు చెప్పగా చివరగా రూ.50 వేలు తీసుకుని ఇప్పుడే వస్తానని వెళ్లిపోయాడు. అలా వెళ్లిన వాడు ఎంతకీ రాకపోవడంతో పెద్దయ్య అతడికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయామని గ్రహించిన పెద్దయ్య, జయమ్మలు శుక్రవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● దంపతులను మోసం చేసిన వ్యక్తి
● రూ.50 వేలతో ఉడాయించిన వైనం
Comments
Please login to add a commentAdd a comment