
శోభాయమానంగా గిరిపరిక్రమణ
● గోవింద నామస్మరణతో
మార్మోగిన బిలకూట క్షేత్రం
బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా గిరిప్రదక్షణ ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భగవంతుడికి భక్తుడిని చేరువ చేసేందుకు రమణమహర్షి సూచించిన గిరిప్రదక్షణను అరుణాచలంలో ఘనంగా నిర్వహిస్తారు. ఆ సంప్రదాయాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలనే సంకల్పంతో ఎనిమిదేళ్ల నుంచి కొండ చుట్టూ గిరిపరిక్రమణ నిర్వహిస్తున్నారు. వేకువనే ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రసన్నుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సుముహూర్తంలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి, ఉభయదేవేరుల ఉత్సవ మూర్తులతో వేదపండితులు వేదనాదం చేస్తుండగా, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణ మధ్య స్వామివారు కొండ దిగి కిందకు వచ్చారు. అలంకార ప్రియుడైన స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి కొండ దిగగా గోవింద నామాలు కీర్తిస్తూ భక్తులు సవ్య దిశలో కొండ చుట్టూ ప్రదక్షణ చేశారు. గోవింద నామస్మరణలు, అన్నమయ్య కీర్తనలు, కోలాట ప్రదర్శనల నడుమ కొండ చుట్టూ భక్తులు చేసిన పరిక్రమణ ఆద్యంతం భక్తి పారవశ్యంతో సాగింది. భగవంతుడి సత్సంగంలో భాగమైన స్మరణ, స్తోత్రం, దర్శనం, సన్నిధి నివాసం, తదితర క్రియల్లో గిరి ప్రదక్షణే అత్యంత శక్తి వంతమైనదని ఈ సందర్భంగా అర్చకులు తెలిపారు. కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి దంపతులు, ఆర్డీఓ వంశీకృష్ణ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తొలిసారి ఉత్సవ మూర్తులతో..
బిలకూట క్షేత్రంలో ఎనిమిదేళ్ల క్రితం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించగా గతేడాది వరకు స్వామివారి నిలువెత్తు చిత్రపటంతోనే భక్తులు కొండ చుట్టూ సవ్య దిశలో ప్రదక్షిణ నిర్వహించేవారు. ఈ దఫా మాత్రం స్వామివారు, దేవేరుల ఉత్సవమూర్తులతో గిరిపరిక్రమణ నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment