
వినతులిచ్చి.. దయ చూపమని కోరి..
● కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● అధికారులకు అందిన 309 విన్నపాలు
నెల్లూరు రూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం తమ సమస్యలపై ఉన్నతాధికారులకు అర్జీలిచ్చి దయ చూపాలని కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, డ్వామా పీడీ గంగాభవాని, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 308 అర్జీలను ప్రజలు అందజేశారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖవి 133, మున్సిపల్ శాఖవి 30, సర్వేవి 13, పంచాయతీరాజ్ శాఖవి 16, పోలీస్ శాఖవి 43, సివిల్ సప్లయ్స్‌వి 9 తదితర శాఖలవి 309 ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. కాగా అర్జీదారులకు భోజనం అందజేశారు. అన్న క్యాంటీన్లకు సరఫరా చేసే వారు కలెక్టరేట్ వ్యాన్‌లో భోజనం తీసుకొచ్చి వడ్డించారు.
కాలువ నిర్మించండి
25వ డివిజన్ బుజబుజ నెల్లూరు భగత్‌సింగ్ కాలనీలో డ్రెయినేజీలు నిర్మించాలని స్థానికులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో ఒకటో వీధి నుంచి మసీదు వరకు 11 వీధులున్నాయని, అక్కడ కాలువల్లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అధికారంలో ఉన్న కొందరు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కాలువలు నిర్మిస్తున్నారని తెలిపారు. 300 కుటుంబాలు ఉన్న ఏరియాలో నిర్మించట్లేదని వాపోయారు. ఉయ్యాల శ్రీనివాసులు, కె.కృష్ణమూర్తి, నాగూర్‌బాబు, వెంకటస్వామి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment