నెల్లూరు (టౌన్): ఇంటర్‌కు సంబంధించిన ఫిజిక్స్, ఎకనమిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనాన్ని స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా సబ్జెక్టుల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు మాట్లాడారు. మూల్యాంకనంలో 750 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారని తెలిపారు. కెమిస్ట్రీ, హిస్టరీకి సంబంధించిన మూల్యాంకనాన్ని ఈ నెల 24 నుంచి.. బాటనీ, జువాలజీ, కామర్స్ ప్రక్రియను 26 నుంచి ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారానికి పూర్తి చేయనున్నామని ప్రకటించారు.
మీటర్ రీడర్ల నిరసన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని విద్యుత్ భవన్ వద్ద మీటర్ రీడర్లు నిరసనను గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిశోర్, మీటర్ రీడర్ల ప్రధాన కార్యదర్శి హజరత్‌వలీ మాట్లాడారు. తమ శ్రమను కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఎస్క్రో ద్వారా వేతనాలివ్వాలని ఆదేశాలు జారీ చేసినా, జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్న తరుణంలో పనికరువై మీటర్ రీడర్లు రోడ్డున పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళికి వినతిపత్రాన్ని అందజేశారు. మీటర్ రీడర్ల కోశాధికారి బాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటసుబ్బయ్య, ఫిరోజ్, చెంచురామయ్య, సుబ్బయ్య, రవిచంద్ర పాల్గొన్నారు.
డీసీపల్లిలో 245 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 245 బేళ్లను గురువారం విక్రయించారని నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 269 బేళ్లు రాగా, వీటిలో 245ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.280.. కనిష్ట ధర రూ.270.. మొత్తమ్మీద సగటు ధర రూ.277.19గా నమోదైందని వివరించారు. వేలంలో 32,510 కిలోల పొగాకును విక్రయించగా, రూ.90,11,680 వ్యాపారం జరిగిందని, ఎనిమిది కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారన్నారు.
రేషన్ బియ్యం లారీ పట్టివేత
కావలి: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని దగదర్తి మండల పరిధిలోని జాతీయ రహదారిపై తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో గురువారం పట్టుకున్నారు. లారీలో 520 బస్తాలున్నాయని, గుడ్లూరు మండలం పెద్దపవని నుంచి చైన్నెలోని రెడ్‌హిల్స్‌కు వెళ్తుండగా పట్టుకున్నామన్నారు. అనంతరం లారీని దగదర్తి పోలీసులకు అప్పగించారు.
ఖజానా శాఖలో పలువురికి ఉద్యోగోన్నతి
నెల్లూరు(అర్బన్): ఉమ్మడి జిల్లాలో ఖజానా శా ఖలో పనిచేస్తున్న పలువురు సీనియర్ అసిస్టెంట్లకు సబ్ ట్రెజరీ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ మోహన్‌రావు ఉత్తర్వులను గురువారం జారీ చేశారు. ఉద్యోగోన్నతులు పొందిన వారిలో ఉస్మాన్, రామారావు, విజయలక్ష్మి, నిజాముద్దీన్, శ్యామల, నాగేశ్వరరావు, నాగరాజు ఉన్నారు.

మూల్యాంకనం ప్రారంభం