సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో రైతులకు ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి సివిల్ సప్లయీస్, కో–ఆపరేటివ్ మార్కెటింగ్ శాఖల ద్వారా 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికార యంత్రాంగం ఆర్భాటంగా ప్రకటించింది. అధికార యంత్రాంగం, మిల్లర్లు మిలాఖత్ అయి నిత్యం పీపీసీల ద్వారా ధాన్యం కొనుగోలు లక్ష్యం ఒక తంతుగా మార్చేశారు. దళారుల ద్వారా మిల్లర్ కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం పీపీసీల లెక్కల్లో వేసి రైతులను దగా చేస్తున్నారు. పీపీసీల ద్వారా ధాన్యం విక్రయించినట్లు నమోదైన రైతులకు మద్దతు ధర ప్రకారం పుట్టికి రూ.19,600 అందించామని అధికారులు నిజాయితీగా గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా?. నిరూపించగలరా?. అంటే ఏదీ చెప్పలేరు.
దిగుబడి ఎంత.. కొన్నది ఎంత..
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరం చేశామని నిత్యం ఆర్భాటంగా అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌కు సంబంధించి సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని వీరే చెబుతున్నారు. కానీ శనివారం నాటికి 33,275 మెట్రిక్ టన్నుల ధాన్యం పీపీసీల ద్వారా కొనుగోలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 60 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. అంటే దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చాయి. ఇందులో పీసీసీల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం 5 శాతం కూడా లేదని అధికారుల ప్రకటన ద్వారానే అర్థమవుతోంది. దిగుబడి వచ్చిన 95 శాతం ధాన్యం నేరుగా మిల్లర్లకు దళారుల ద్వారా విక్రయిస్తున్నారనేది వాస్తవం. అధికార యంత్రాంగం 300 పీపీసీలు ఏర్పాటు చేసినట్లు ఆర్భాటంగా చెబుతున్నా.. జిల్లాలో ఒక్క రైతుకు కూడా న్యాయం జరగడం లేదనేది ఈ లెక్కలే చెబుతున్నాయి.
పీపీసీల ద్వారా దళారులే విక్రయాలు
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 33,275 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నా, ఇందులో 90 శాతం దళారుల ద్వారానే జరిగాయని తెలుస్తోంది. వాస్తవానికి రైతులు పీపీసీలను సంప్రదించినా మిల్లరు ధాన్యం కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తేనే గన్నీ బ్యాగ్‌లు ఇస్తారు. ఈ ప్రక్రియ అస్సలు జరగడం లేదు. పీపీసీల ద్వారా ధాన్యం కొనుగోలుకు మిల్లరు సిద్ధపడితే ధాన్యం పట్టుబడి నుంచి మిల్లు వరకు చేర్చే బాధ్యత ఆ రైతుదే. ధాన్యం పట్టుబడి చేయడానికి బస్తాకు రూ.30 కూలి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రైతులే భరించుకోవాలి. 99 శాతం మంది మిల్లర్లు పీపీసీల ద్వారా ధాన్యం విక్రయించుకునే రైతులకు గన్నీ బ్యాగ్‌లు ఇవ్వడం లేదు. రైతులే బస్తాలు, ట్రానన్స్‌పోర్టు వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తీరా మిల్లరు దగ్గరకు ధాన్యం తీసుకెళ్లితే నాణ్యత లేదని, గడ్డి ముక్క ఉందని, తేమ శాతం అధికంగా ఉందని తరుగు పేరుతో పేచీ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. ఇన్ని ఖర్చులు, ఇన్ని ఇబ్బందులు భరించినా.. చివరకు ఆ రైతుకు పుట్టి ధాన్యానికి దక్కే ధర రూ.15 వేలు కూడా రావడం లేదు. దీంతో రైతులు ఈ తలనొప్పులు ఎందుకుని దళారులనే ఆశ్రయించి అమ్ముకుంటున్నారు. వీరు సదరు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి వారి పొలం తాలూకా పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్లి పీపీసీలో నమోదు చేయించుకుంటున్న విషయం బహిరంగ విషయం.
బ్యాంక్ గ్యారెంటీలు అరకొరే
జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్ రైస్ మిల్లింగ్) చేసే మిల్లులు 103 ఉన్నప్పటికీ వీటిలో కేవలం 50 నుంచి 60 మిల్లులు మొక్కుబడిగా బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చాయి. మిగతా మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వకపోయినా.. అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో వారికే తెలియాలి. పీపీసీ ద్వారా ధాన్యాన్ని మిల్లుకు ట్యాగ్ చేయాలంటే.. సదరు మిల్లరు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి ఉండాలి. బ్యాంక్ గ్యారెంటీ లేని మిల్లుకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని పీపీసీ ద్వారా పంపించడం అసాధ్యం. మిల్లర్లు ప్రభుత్వానికి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వకపోవడంతో పీపీసీలు ఆ మిల్లులకు ధాన్యాన్ని ట్యాగ్ చేయడం లేదు. దీంతో రోజుల తరబడి రైతులు ధాన్యాన్ని నిలబెట్టుకోలేక నేరుగా మిల్లర్లకు దళారుల ద్వారా విక్రయించుకుంటున్నారు.
రైతు నష్టపోతున్నదిలా..
జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల
దిగుబడి అంచనా
ఇప్పటికే 60 శాతం కోతలు పూర్తి
పీపీసీల ద్వారా 33,275
మెట్రిక్ టన్నులే కొనుగోలు
103 రైస్ మిల్లులకు సీఎంఆర్ అనుమతి
50 మిల్లులే రూ.30 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ
కల్లాల్లో ధాన్యం కొనడం ఒక ప్రహసనం
జిల్లాలో పీపీసీల ద్వారా ధాన్యం కొనుగోలు ఒక తంతుగా సాగుతోంది. దిగుబడికి.. కొనుగోలుకు మధ్య తేడానే ఇందుకు అద్దం పడుతోంది. సీఎంఆర్ అనుమతి ఉన్న రైస్ మిల్లుల్లో సగం మిల్లులు కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వలేదంటే ప్రభుత్వం, రైస్ మిల్లర్లు కలిసి ‘దోపిడీ డ్రామా’ ఆడుతున్నట్లు విస్పష్టమవుతోంది. కల్లాల్లోనే ధాన్యం కొనడం ఒక ప్రహసనంగా సాగుతోంది. ఏ రోజుకు ఆ రోజు పీపీసీల ద్వారా కొంటున్న ధాన్యం లెక్కలు అధికార యంత్రాంగం ప్రకటిస్తున్నా.. ఏ రైతు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు చేసుకోవడం లేదు. నేరుగా దళారులకే అమ్ముకుంటున్నారనేది నిజం.
కొడవలూరు మండలానికి చెందిన ఓ రైతుకు 8 ఎకరాల పొలం ఉంది. ఆయన బీపీటీ 5204 వరి సాగు చేశాడు. పంట కోతకు రావడంతో ఒక దళారీని సంప్రదించాడు. పుట్టికి రూ.17 వేలు మాత్రమే ధర ఉందని చెప్పాడు. దీంతో ఆ రైతు స్థానిక పీపీసీ ద్వారా ధాన్యం విక్రయించడానికి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను సంప్రదించాడు. దిగుబడి అంచనాను బట్టి గన్నీ బ్యాగ్స్ ఆ రైతుకు అందజేశారు. వరి కోత కోసి ధాన్యం రాసి పోశాడు. సదరు రైతు ధాన్యం సరఫరా చేయడానికి ట్యాగ్ చేసిన మిల్లర్ అంత ధాన్యం తాము తీసుకోమని, మార్కెట్లో పుట్టి రూ.17 వేలే ఉంటే.. పీపీసీ ద్వారా రూ.19,700 పెట్టి ఎందుకు కొనాలని రైతును ప్రశ్నించాడు. ఇక కూలీలు, రవాణా ఖర్చులు పెట్టుకుని, మిల్లర్ అడిగినంత తరుగు ఇచ్చుకుంటే.. పుట్టికి రూ.16 వేలు కూడా వచ్చేటట్లు లేదని లెక్కలు వేసుకున్న ఆ రైతు ఆలోచనలో పడ్డాడు. అప్పటికే రెండు రోజులు గడిచిపోవడంతో ధాన్యం తడారిపోతుండడంతో నేరుగా మిల్లర్‌కే దళారీ ద్వారా విక్రయించాడు. కానీ ఈ ధాన్యం పీపీసీ ద్వారా విక్రయించినట్లు ఇటు అధికారులు, అటు మిల్లర్ నమోదు చేసుకున్నారు.