
తవ్వేస్తాం.. అమ్మేస్తాం
● కల్లూరుపల్లిలోని చెరువులో
ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు
● అధికార పార్టీ కార్పొరేటర్ భర్త కనుసన్నల్లో..
● ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇసుక, మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. కల్లూరుపల్లిలోని సర్వే నంబర్ 8లోని కొత్త చెరువులో నాలుగు రోజులుగా అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా జేసీబీతో మట్టిని తవ్వి రోజూ ట్రాక్టర్లలో 200 ట్రిప్పుల్లో తరలించేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని రూ.1,000 నుంచి రూ.1,200 చొప్పున విక్రయిస్తున్నారని సమాచారం. 24వ డివిజన్ కార్పొరేటర్ భర్త అరవ శ్రీనివాసులు అండదండలతో కాంట్రాక్టర్లు చెరువులోని మట్టిని తరలిస్తున్నారని విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే చెరువులో తవ్వకాలు మొదలయ్యాయి. నాడు సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో కొంతకాలం మిన్నకుండిపోయారు. అప్పుడప్పుడు రాత్రి వేళల్లో తవ్వకాలు చేస్తుండేవారు. అయితే నాలుగు రోజులుగా ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నారు. కల్లూరుపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ లేవుట్‌కు మట్టిని తరలిస్తున్నారు. కాగా తవ్వకాల కారణంగా పది అడుగుల గుంతలు ఏర్పడ్డాయి. తవ్వకాలపై స్థానికులు రెండురోజుల క్రితం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది.

తవ్వేస్తాం.. అమ్మేస్తాం

తవ్వేస్తాం.. అమ్మేస్తాం