
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
● జేసీ కార్తీక్
నెల్లూరు రూరల్: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, నెల్లూరు నగరంలో ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత రోడ్డు ప్రమాదా ల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ గంగాధర్ కమిటీ సభ్యులకు వివరించా రు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న దృష్ట్యా ఏసీ కూరగాయల మార్కెట్ సెంటర్, జిల్లా పోలీసు కార్యాల యం సెంటర్, కేవీఆర్ జంక్షన్, కనకమహల్ సెంటర్, రామలింగాపురం, వీఆర్‌సీ ప్రధాన కూడళ్లలో సిగ్నల్ వ్యవస్థను మే మొదటి వారంలోగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుజబుజనెల్లూరు నుంచి కోవూరు వరకు జాతీయరహదారిపై ప్రమాదాలు జరుగుతు న్న 11 ప్రాంతాల్లో సోలార్ లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు. జాతీయరహదారిపై వాహనదారులు విశ్రాంతి తీసుకునేందుకు మనుబోలు సమీపంలో సర్వే ల్యాండ్ రికార్డుల అధికారి కొన్ని ప్రదేశాలను ఎంపిక చేశారని, వీటిలో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి వాహనదారుల విశ్రాంతి కోసం అన్ని మౌలిక వసతులతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రహదారుల వద్ద స్పీడ్ బ్రేకర్లు, పెయింటింగ్, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పొదలకూరురోడ్డు వద్ద డివైడర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారిపై మద్యం దుకాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో రద్దీ ప్రాంతాల్లో రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, ఇతర ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారులతో కలిసే పంచాయతీరాజ్ రహదారుల వద్ద ప్రమాదాల నివారణకు 52 ప్రాంతాల్లో భద్రతా చర్యల కోసం రూ.1.68 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు జేసీకి వివరించారు. ఆర్‌అండ్‌బీకి సంబంధించి ప్రమాదభరిత ప్రాంతాల్లో రూ.1.20 కోట్లతో భద్రతా చర్యలకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎస్‌ఈ తెలిపారు. నెల్లూరు నగరంలో 3,200 లైట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పగా, ఇంకా అవసరమైన ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో నెల్లూరు, ఒంగోలు ఎన్‌హెచ్‌ఏ పీడీలు ఎంకే చౌదరి, ఎం. విద్యాసాగర్, సర్వే ల్యాండ్ రికార్డుల ఏడీ నాగశేఖర్, డీఎస్పీ జి. శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ కె రామకృష్ణ, మున్సిపల్ ఎస్‌ఈలు రామ్మోహన్‌రావు, జానీ తదితరులు పాల్గొన్నారు.