
హిమోఫీలియాపై అప్రమత్తంగా ఉండాలి
కావలి: పట్టణంలోని రెడ్‌క్రాస్ తలసేమియా డే కేర్ సెంటర్‌లో ప్రపంచ హిమోఫీలియా దినాన్ని గురువారం నిర్వహించారు. తలసేమియా డే కేర్ సెంటర్ వైద్యాధికారులు మనోహర్‌బాబు, శ్రీధర్ మాట్లాడుతూ హిమోఫిలియా అనేది రక్తం గడ్డకట్టే సామర్థ్యం తక్కువగా ఉండే జన్యుపరమైన రుగ్మత అని, దీన్ని తెలుగులో రక్తస్రావ వ్యాధిగా పిలుస్తారని తెలిపారు. ఈ రుగ్మత ఉన్నవారిలో గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. దెబ్బపైకి కనపడకపోయినా అంతర్గత రక్తస్రావం జరుగుతుందని, ఒకవేళ తలలో అంతర్గత రక్తస్రావం జరిగితే కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ జబ్బు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కావలి రెడ్‌క్రాస్ ఉపాధ్యక్షుడు డాక్టర్ బెజవాడ రవికుమార్ మాట్లాడుతూ హిమోఫీలియా ఉన్నవారికి రెడ్‌క్రాస్ రక్తకేంద్రాల్లో ఉచితంగా రక్తం అందజేస్తారని తెలిపారు. అనంతరం తలసేమియా డే కేర్ సెంటర్‌లో సేవలు అందిస్తున్న వైద్యులు మనోహర్‌బాబు, శ్రీధర్, రమ్య, స్టాఫ్‌నర్స్ శేషమ్మను ఘనంగా సత్కరించారు. రెడ్‌క్రాస్ చైర్మన్ డీ రవిప్రకాష్, వైస్‌చైర్మన్ కే హరినారపరెడ్డి, కోశాధికారి అరికట్ల మధుసూదన్‌రావు, కార్యదర్శి బీఎస్ ప్రసాద్, పాలకమండలి సభ్యులు ఓరుగంటి వెంకటేశ్వర్లు, గొట్టిపాటి మనోరమ, ఎన్ ప్రణీత్, సభ్యులు కల్లయ్య, హరిచందన, జిల్లా పాలకమండలి సభ్యులు కలికి శ్రీహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీనాథ సాహిత్యంపై
ఉపన్యాసం రేపు
నెల్లూరు(బృందావనం) : పురమందిరం ప్రాంగణంలోని వర్ధమాన సమాజం హాల్లో చేతన సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో శనివారం రాత్రి 7 గంటలకు ‘శ్రీనాథ మహాకవి సాహిత్యం, జీవనం’ అనే అంశంపై ఉపన్యాసం జరుగనుందని సంస్థ నిర్వాహకులు ఎం.సుబ్రహ్మణ్యం, వై.శేషగిరీశం గురువారం తెలిపారు. కవి, కథా రచయిత, వ్యాసకర్త సీహెచ్వీ బృందావనరావు వక్తగా వ్యవహరించనున్నారన్నారు. ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు.