
బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి
నెల్లూరు (బృందావనం): హిందుస్థాన్‌గా పిలవబడే భారతదేశంలో హిందువులు ప్రాణ భయంతో పారిపోయే దుస్థితి రావడం చాలా బాధాకరమని, హిందువులపై జరుగుతున్న దాడులు దారుణమని ఛత్రపతి శివాజీసేన అధ్యక్షుడు కాకు మురళీరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్‌లో హిందువులపై జరిగిన మారణకాండను నిరసిస్తూ ఆదివారం సాయంత్రం నగరంలోని ట్రంకురోడ్డు గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఛత్రపతి శివాజీసేన, హిందూసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాకు మురళీరెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ చట్టంపై నిరసనలకు హిందువుల ఇళ్లపై దాడులు చేయడానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్ పాకిస్తాన్ కన్నా ప్రమాదకరమైన ప్రాంతంగా మారిందన్నారు. హిందువుల ధన, మాన ప్రాణాలపై దాడు లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులను ఇంటి నుంచి బయటకులాగి హతమార్చడం, మహిళలపై అత్యాచారాలు, ఆస్తులు లూటీ చేయడం చేస్తుంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను పరిరక్షించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. హిందువులలో ఐక్యత లేనందునే మొన్న బంగ్లాదేశ్‌లో నిన్న బెంగాల్‌లో దాడులు జరిగాయన్నారు. హిందువులు సంఘటితం కాకున్నా, మేల్కోనకుంటే ఈ ఉన్మాద దాడులు దేశమంతా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. మతఛాందస వాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి ఛత్రపతి శివాజీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. శివాజీ సెంటర్‌లోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో శివాజీసేన గౌరవ అధ్యక్షుడు బత్తిన సాయికుమార్‌రెడ్డి, కార్యదర్శి మధురెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్‌చౌదరి, సభ్యులు పెరుమాళ్, స్వామి, మోహన్‌రెడ్డి, హిందూ చైతన్య వేదిక నాయకులు నాగ శ్రీనివాస్, పీజీ మహేష్, సొల్లేటి వెంకటేశ్వర్లు, యశ్వంత్, సుధీర్, మహిళా నాయకులు లక్ష్మి, కృష్ణవేణి, మాధవి, వీహెచ్‌పీ నేతలు, హిందూ సంఘాల నేతలుపాల్గొన్నారు.