
సిలబస్‌ను తగ్గించాలి
మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లో అర్హతలకు కొర్రీలు పెట్టడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నాళ్లగానో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు కుమ్మరించింది. డీఎస్సీ పరీక్షలకు పోటీపడే అభ్యర్థుల సంఖ్యను తగ్గించాలనే కుతంత్రంతో కొత్త కొత్త నిబంధనలతోపాటు ఏపీపీఎస్సీ పరీక్షలు జరిగే సమయంలో షెడ్యూల్ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ విడుదలపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● ఒకే సమయంలో డీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షలపై అభ్యర్థుల ఆందోళన
● ఇంటర్, డిగ్రీలో 50 శాతం, పీజీలో 55 శాతం మార్కుల నిబంధన
● పరీక్షలకు సమయం 45 రోజులే
● ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణపై సందేహాలు
● జిల్లాలో పోస్టులు 673.. అభ్యర్థులు 25 వేలకు పైగానే
డీఎస్సీ పరీక్షకు సిలబస్‌ను తగ్గించాలి. ఎన్నడూ లేని విధంగా ఈ డీఎస్సీలో ఇంటర్ సిలబస్‌ను చేర్చడం తగదు. దీని వల్ల అభ్యర్థులు ఎక్కువ అవకాశాలు కోల్పోతారు. ఇంటర్, డిగ్రీల్లో 50 శాతం మార్కులు ఉంటేనే అర్హులని ప్రకటించడం దారుణం. ఈ నిబంధనలతో అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది.
– ఆదిత్యసాయి, రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ
నెల్లూరు (టౌన్): డీఎస్సీ నోటిఫికేషన్ రెండుసార్లు వాయిదా వేసిన టీడీపీ ప్రభుత్వం ఎట్టకేలకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 673 పోస్టులు ఉండగా, సుమారు 25 వేల మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో కేవలం 115 ఎస్జీటీ పోస్టులే ఉన్నాయి. ఈ పోస్టులకే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 673 స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు లెక్కలు తేల్చారు. ఇందులోనే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు హిందీ–1, ఇంగ్లిష్–1, మ్యాథ్స్–1, ఎస్జీటీలు–2 పోస్టులు ఉన్నాయి.
ఒకే సమయంలో డీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షలు
డీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షలను ఒకే సమయంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏపీపీఎస్సీ పరీక్షలు జూన్ 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయని షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏపీపీఎస్సీ పరీక్షల ద్వారా పాలిటెక్నిక్, జూనియర్ అధ్యాపకులు, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల భర్తీ నిర్వహించనున్నారు. తాజాగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులే డీఎస్సీ పరీక్షకు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్నారు. రెండు పరీక్షలను ఏక కాలంలో నిర్వహించడం వెనుక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్యను తగ్గించే కుట్ర దాగి ఉందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
డీఎస్సీ పరీక్షల్లో నిబంధనల కొర్రీ
డీఎస్సీ నోటిఫికేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టి భావి ఉపాధ్యాయుల కలలను కల్లలు చేసింది. ఎస్జీటీ పోస్టులకు ఇంటర్‌లో 50 శాతం మార్కులు, స్కూల్ అసిస్టెంట్లు పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పీజీలో 55 శాతం మార్కులు ఉండాలన్న నిబంధన పెట్టారు. ఈ నిబంధనలతో సగమంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసే అర్హత కోల్పోతారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఈడీలో చేరే సమయంలో డిగ్రీలో 40 శాతం మార్కులు అర్హతగా ఉంటే డీఎస్సీ పరీక్షకు 50 శాతం అర్హత మార్కులు పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు ఇంటర్ సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ప్రస్తుత ఇంటర్ సిలబస్‌పై అవగాహన లేదు. గతంలో పదో తరగతి వరకు ఉన్న సిలబస్‌లోనే పరీక్ష నిర్వహించే వారు. డీఎస్సీ పరీక్షలను నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. భారీ సంఖ్యలో హాజరుకానున్న డీఎస్సీ పరీక్షకు అన్ని కంప్యూటర్లను ఎక్కడి నుంచి తేగలరని ప్రశ్నిస్తున్నారు. 2018లో టీడీపీ హయాంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షకు తగిన కంప్యూటర్లు లేకపోవడంతో ఎక్కువ మంది అభ్యర్థులకు పొరుగు రాష్ట్రాలైన చైన్నె, ఒడిశా, తెలంగాణ, కర్ణాటకలో సెంటర్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లలేక కొందరు అభ్యర్థులు పరీక్ష రాయకుండా ఆగిపోయారు. ఆన్‌లైన్ పరీక్షల్లో తప్పులు దొర్లే అవకాశం ఉందని చెబుతున్నారు.
పరీక్షకు సమయం తక్కువ
నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి పరీక్ష తేదీకి కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో పరీక్ష నిర్వహిస్తే ఏ విధంగా రాయగలమని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. గతంలో డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో వేల రూపాయిలు వెచ్చించి కోచింగ్ తీసుకున్నామని, కాలయాపన చేసి ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడంతో కోచింగ్‌కు మళ్లీ ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువ సమయం కేటాయించాలి
డీఎస్సీ నోటిఫికేషన్‌కు, పరీ క్షల తేదీకి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. కేవలం 45 రోజుల వ్యవధి మాత్రమే ఉండడం వల్ల పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండదు. గతంలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడంతో ప్దె మొత్తాల్లో ఖర్చు చేసి కోచింగ్‌లు తీసుకున్నారు. ఇప్పుడు హడావుడి చేయడంతో తీవ్ర నష్టం జరుగుతోంది.
– లీలామోహన్, రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ

సిలబస్‌ను తగ్గించాలి

సిలబస్‌ను తగ్గించాలి

సిలబస్‌ను తగ్గించాలి