
సీహెచ్‌ఓలను క్రమబద్ధీకరించాలి
● కలెక్టరేట్ ఎదుట ధర్నా
నెల్లూరు (అర్బన్): దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, తమ సర్వీస్ ను క్రమబద్ధీకరించాలని కోరుతూ జిల్లాలోని కమ్యూ నిటీ హెల్త్ ఆఫీసర్‌లు (సీహెచ్‌ఓలు) మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భానుమహేష్, కృష్ణవేణి మాట్లాడుతూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ల్లో జిల్లాలో 497 మంది పని చేస్తున్నామన్నారు. నాలుగున్నరేళ్ల పాటు బీఎస్సీ నర్సింగ్, మరో రెండేళ్ల పాటు ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తి చేసి వైద్యశాఖలో చేరామన్నారు. నడవలేని వృద్ధులు, పక్షవాతం పెషేంట్ల ఇళ్ల వద్దకే వెళ్లి 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు గ్రామీణ స్థాయిలో అందిస్తున్నామన్నారు. తమకు ప్రభుత్వం కేవలం రూ. 25 వేలను మాత్రమే జీతంగా ఇస్తుందన్నారు. తమకు వచ్చే జీతంలోనే సొంత ఖర్చులు పెట్టుకుంటూ వివిధ రకాల శిక్షణలకు, ఆరోగ్య కార్యక్రమాలకు హాజరవుతున్నామన్నారు. ఆస్పత్రులకు తరలించే మెటీరియల్‌ను జిల్లా కేంద్రాల నుంచి తమ సొంత ఖర్చులతోనే తీసుకెళ్తున్నామన్నారు. క్లినిక్‌ల అద్దెలు కూడా ప్రభుత్వం 10 నెలలుగా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుచోట్ల యజమానుల ఒత్తిడి తట్టుకోలేక సీహెచ్‌ఓలే క్లినిక్‌ల అద్దెలు కూడా చెల్లిస్తున్నారన్నారు. రకరకాల కారణాలు చెప్పి ఇన్‌సెంటివ్స్‌కు కూడా కోత వేశారన్నారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని, ఆయుష్మాన్ భారత్ కింద ఉద్యోగ భద్రత కల్పించాలని, జాబ్ చార్ట్ ప్రకారమే విధులు కేటాయించాలని కోరారు. ఈపీఎఫ్‌ను పునరుద్ధరించాలని, సీహెచ్‌ఓలకు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు మినహాయింపు నివ్వాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే నిరాహార దీక్షలు, ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఆ సంఘం నాయకులు ఆదిల్, రెబికా, సుమాంజలి, రమ, అన్ని మండలాల నుంచి వచ్చిన సీహెచ్‌ఓలు పాల్గొన్నారు.