
బావిలో ఈతకెళ్లి..
● ఫార్మసీ విద్యార్థి మృతి
● మృతుడు అనంతపురం జిల్లా వాసి
కొడవలూరు: సరదాగా బావిలో ఈతకెళ్లి ఫార్మసీ విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలోని రేగడిచెలికలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నార్తురాజుపాళెం శ్రీవెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గొళ్ల గ్రామానికి చెందిన కురుబన్ అంజన్‌కుమార్ (20) ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటున్నాడు. బుధవారం 3డే ఫెస్ట్ విజయోత్సవాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న అంజన్‌కుమార్ అనంతరం తన నలుగురు స్నేహితులతో కలిసి రేగడిచెలికలోని బావి వద్ద వెళ్లాడు. అంజన్, ఇద్దరు బావిలో ఈతకు దిగారు. ఇద్దరు మాత్రం ఈత రాదంటూ బయటే ఉండిపోయారు. కాసేపటికి ఇద్దరు విద్యార్థులు బయటకు రాగా అంజన్ పైకి రాలేదు. దీంతో ఆందోళన చెందిన వారు కళాశాల యాజమాన్యానికి తద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఈత తెలిసిన వారితో బావిలో వెతికించారు. సుమారు 40 అడుగుల వరకూ నీళ్లు ఉండటం, అడుగున బురద ఉండటంతో అందులో కూరుకుపోయిన అంజన్‌ను వెలికి తీసేందుకు వీలు కాలేదు. ఎస్సై పి.నరేష్, కళాశాల యాజమాన్యం గజ ఈతగాళ్లను పిలిపించారు. వారు మృతదేహం కాలికి తాడు కట్టి వెలికి తీశారు. తల్లిదండ్రులకు ఇద్దరు ఆడ పిల్లల తర్వాత అంజన్ మూడో సంతానమని ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు.