గోరంట్ల/హిందూపురం అర్బన్: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు విద్యుత్ షాక్ గురై మృతి చెందగా... మరొకరు ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు...
► గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి, పుష్పలత దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె నిఖితారెడ్డి (15) తొమ్మిదో తరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లిన ఆమె నీటి కొళాయిని తాకగానే విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కొళాయికి విద్యుత్ సరఫరా జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న సీఐ సుబ్బరాయుడు అక్కడు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
► హిందూపురం పట్టణానికి చెందిన ఎంఐఎం నాయకుడు నిస్సార్ అహమ్మద్ (58) సోమవారం ఉదయం బళ్లారికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని వెంటనే వెనుదిరిగాడు. మంగళవారం వేకువజామున అనంతపురం జిల్లా కణేకల్లు క్రాస్ వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా వచ్చిన పశువును ఢీకొని వాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. ఘటనలో తలకు బలమైన గాయమైన నిస్సార్ అహమ్మద్‌ను అటుగా వెళుతున్న వారు గమనించి, సమాచారం అందించడంతో సమీపంలో ఉన్న బంధువులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని హిందూపురానికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment