అంతటా ఆధిపత్య పోరే! | - | Sakshi
Sakshi News home page

అంతటా ఆధిపత్య పోరే!

Published Tue, Jan 28 2025 12:25 AM | Last Updated on Tue, Jan 28 2025 12:25 AM

అంతటా

అంతటా ఆధిపత్య పోరే!

సాక్షి, పుట్టపర్తి

రాష్ట్రంలో కూటమి సర్కార్‌ కొలువుదీరాక ఆయా పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది. కొన్నిచోట్ల బీజేపీ, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగుతుండగా..మరికొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే రెండు వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. ఇక కూటమిలో భాగమైనా తమను పట్టించుకోవడం లేదని జనసేన నేతలు తెగబాధపడిపోతున్నారు. అందరినీ సమన్వయపరచాల్సిన అమాత్యులూ అగ్గి రాజేస్తుండటంతో జిల్లాలో పరిస్థితి చేయిదాటుతోంది. నేతలు రోడ్డెక్కి ఘర్షణ పడుతున్న తీరు చూసి... ‘అభివృద్ధి చేయమని అధికారం ఇస్తే మీరు చేసే పని ఇదా’’ అంటూ జనం పెదవి విరుస్తున్నారు.

ఎప్పుడూ కలిసి లేరు..

కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఏనాడూ కలిసి లేరు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి విషయంలోనూ ఆయా పార్టీల నేతల మధ్య విభేదాలు బయట పడుతున్నాయి. మద్యం దుకాణాల టెండర్లు, సాగునీటి సంఘం ఎన్నికలు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల నియామకం, ఉద్యోగుల పోస్టింగులు, ప్రారంభోత్సవాలు, పార్టీలో చేరికలు.. ఇలా ప్రతి విషయంలోనూ విభేదాలు బట్టబయలు అవుతున్నాయి. రెండు రోజుల క్రితం ధర్మవరంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఆదరణ లేక అసహనం..

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అయినప్పటికీ.. ఆయన చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తారు. దీంతో అక్కడ ఉన్న బీజేపీ, జనసేన నాయకులను పలకరించే దిక్కు లేదు. పుట్టపర్తిలోనూ అదే పరిస్థితి. సింధూరరెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా, ఆమె మామ పల్లె రఘునాథరెడ్డి అంతా తానై వ్యవహరిస్తున్నారు. ప్రతి సమావేశానికి హాజరవుతూ హడావుడి చేస్తున్నారు. దీంతో బీజేపీ, జనసేన కార్యకర్తలకు కేరాఫ్‌ అడ్రస్‌ లేకుండా పోయింది. కదిరిలో బీజేపీ తరఫున బడా నాయకులు ఉన్నప్పటికీ... ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌దే రాజ్యం.. రాజకీయం. దీంతో కదిరిలో కమలనాథులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, జనసేన నేతలు తమ్ముళ్లపై తీవ్ర అసహనంతో ఉన్నారు. అవసరమైతే కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధమయ్యారు.

మంత్రుల ఇలాకాల్లో కూటమి నేతల మధ్య పొసగని పొత్తు

ధర్మవరం, పెనుకొండలో

విమర్శల పర్వం

మిగతా నియోజకవర్గాల్లో కత్తులు దూసుకుంటున్న తమ్ముళ్లు

అధిపత్యం కోసం భౌతిక దాడులకూ సిద్ధమైన వైనం

నేతల తీరుపై పెదవి విరుస్తున్న జనం

రెండు రోజుల క్రితం ధర్మవరంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన చిత్రమిది. బీజేపీలో చేరికలను జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఆధిపత్య పోరుకు తెగబడ్డారు. కూటమి పార్టీల్లో సమన్వయం లోపించిందని చెప్పడానికి ఇదో ఉదాహరణ. తామంతా కలిసే పనిచేస్తున్నామంటూ నాయకులు గొప్పలు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని స్పష్టంగా తెలుస్తోంది. ధర్మవరంతో పాటు పెనుకొండ, మడకశిరలోనూ ‘కూటమి’ పార్టీల నేతల మధ్య సఖ్యత లేనట్లు తెలుస్తోంది. ఇక పలు నియోజకవర్గాల్లో తమ్ముళ్ల మధ్యే ఆధిపత్య పోరు నడుస్తుండగా.. అభివృద్ధి కుంటుపడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
అంతటా ఆధిపత్య పోరే! 1
1/1

అంతటా ఆధిపత్య పోరే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement