జవాబుదారీతనం పెరగాలి
ప్రశాంత నిలయం: ‘‘అధికారుల్లో జవాబుదారీ తనం పెరగాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత శ్రద్ధగా పనిచేయాలి. అప్పుడే ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుంది. ఇందుకోసం ఆయా శాఖల అధిపతులు నిబద్ధతతో పనిచేయాలి. సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. అప్పుడు ఆయా శాఖల్లోని కిందిస్థాయి ఉద్యోగులూ క్రమశిక్షణతో పనిచేస్తారు. సమష్టిగా పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు’’ అని కలెక్టర్ చేతన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 196 అర్జీలను అందగా, వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలను క్షుణ్ణంగా చదివి అర్జీదారులు సంతృప్తి పడేలా సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పురోగతిని ముఖ్యమంత్రి కార్యాలయం నిరంతరం ఆరా తీస్తుందని, ఈవిషయాన్ని గుర్తించి అధికారులు అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం మండల ప్రత్యేక అధికారులు ఆధ్వర్యంలో చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయ సారథి, డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీఓ సువర్ణ, పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, ఆ శాఖ జీఎం నాగరాజు, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్ రావు, డీఎంహెచ్‌ఓ ఫిరోజ్ బేగం, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను
ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలి
అధికారులకు కలెక్టర్
టీఎస్ చేతన్ ఆదేశం
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు
196 అర్జీలు
Comments
Please login to add a commentAdd a comment