రోగులకు మెరుగైన సేవలు అందించాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం
● ధర్మవరం ఆస్పత్రి తనిఖీ
ధర్మవరం అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ వైద్యులను ఆదేశించారు. సోమవారం ఆయన ధర్మవరం పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. ఆకస్మిక తనిఖీలు చేసి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొలుత పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఎంత మంది డయాలసిస్ చేయించుకుంటున్నారని సూపరింటెండెంట్ మాధవిని ప్రశ్నించారు. ఆస్పత్రిలో 21 మంది డయాలసిస్‌కు నమోదు చేయించుకున్నారని, ప్రస్తుతం 16 మందికి డయాలసిస్ చేశామని ఆమె కలెక్టర్‌కు విన్నవించారు. అనంతరం కలెక్టర్ చేతన్... ఆస్పత్రిలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి నుంచి కలెక్టర్ నేరుగా మార్కెట్‌యార్డులోనున్న ఈవీఎం గోడౌన్‌కు వెళ్లారు. గోడౌన్‌కు వేసిన సీల్‌ను పరిశీలించి భద్రతపై ఆరా తీశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ నటరాజ్ తదితర అధికారులు ఉన్నారు.
గోరంట్ల ఎస్‌ఐ సస్పెన్షన్
● నార్శింపల్లి ఘటనలో
నిర్లక్ష్యానికి ఎస్పీ చర్యలు
పుట్టపర్తి టౌన్: గోరంట్ల ఎస్‌ఐ బాబును సస్పెండ్ చేస్తూ ఎస్పీ రత్న సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోరంట్ల మండలం నార్శింపల్లి గ్రామంలో ఓ ప్రేమ వ్యవహారం.. తదనంతరం పరిణామాలకు ఎస్‌ఐని బాధ్యున్ని చేస్తూ ఎస్పీ చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గోరంట్ల మండలం నార్శింపల్లి గ్రామానికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించాడు. కులాలు వేరుకావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమజంట మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే వారి ఆచూకీ కనిపెట్టిన బంధువులు, కొందరు గ్రామస్తులు ప్రేమజంటను గ్రామానికి తీసుకువచ్చారు. అనంతరం యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. ముఖంపై పేడ నీళ్లు చల్లి దాడి చేశారు. ఈ ఘటనను ఎస్పీ రత్న తీవ్రంగా పరిగణించి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శేఖర్, సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. బాలికను తీసుకెళ్లిన యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ బాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
5వ తేదీలోపు
దరఖాస్తు చేసుకోవాలి
పుట్టపర్తి టౌన్: జిల్లాలో ఈడిగ, గౌడ, ఇతర ఉపకులాలకు కేటాయించిన 9 మద్యం షాపులకు ఫిబ్రవరి 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ జిల్లా అధికారి గోవిందనాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్లుగీత కులాల వారికి మద్యం షాపులు రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, లాటరీ ద్వారా మొత్తం 9 షాపులు ఆయా వర్గాలకు కేటాయించినట్లు వెల్లడించారు. అర్హులైన వారు రూ.2 లక్షలు నాన్ రిఫండబుల్ చలానా, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రంతో ఫిబ్రవరి 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో హైబ్రిడ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 6వ తేదీ దరఖాస్తుల పరిశీలన, ఉంటుందని, 7వ తేదీ కలెక్టరేట్‌లో లాటరీ తీసి దుకాణాలు కేటాయిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు పుట్టపర్తి సమీపంలోని ఉజ్వల ఫౌండేషన్ ఆవరణలో ఉన్న జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment