పింఛన్ల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి
● కలెక్టర్ టీఎస్ చేత న్
ప్రశాంతి నిలయం: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జిల్లాలో పకడ్బందీగా సాగాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. ఫిబ్రవరి 1వ తేదీన పింఛన్ల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలు, హౌసింగ్ డీఈలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారం, గృహ నిర్మాణ పనులు తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ, 1వ తేదీన ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. మడకశిర, పెనుకొండ, అగళి, తనకల్లు, అమరాపురం మండలాల ప్రత్యేక అధికారులు పింఛన్ పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అలాగే హౌసింగ్ కాలనీల్లో పూర్తయిన ఇళ్లను ఫిబ్రవరి 1వ తేదీనే లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన వినతులను అప్లోడ్ చేయాలని, డేటా ఎంట్రీలో తప్పుల్లేకుండా చూసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, డీపీఓ సమత, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
‘పది’ విద్యార్థులపై
ప్రత్యేక శ్రద్ధ చూపాలి
● ఉపాధ్యాయులకు డీఈఓ ఆదేశం
ఓడీచెరువు : పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలని డీఈఓ కృష్ణప్ప ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం ఆయన మండల పరిధిలోని కొండకమర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పదో తరగతి సిలబస్‌పై ఆరా తీశారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులలో ముఖాముఖి అయ్యారు. వారి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పదో తరగతి మార్కులు చాలా కీలకమని, దీన్ని గుర్తించి అందరూ చదవాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment