ధర్మవరం రూరల్: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో నిమ్మలకుంట వాసులు ఆందోళన చెందారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దళవాయి చలపతి కుటుంబ సభ్యులతో పాటు మరో పదిమంది తోలుబొమ్మల కళాకారులు మినిస్టరీ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో స్టాల్స్ నిర్వహిస్తున్నారు. వీరుంటున్న ప్రాంతంలో తెల్లవారుజామున భూకంపం సంభవించినట్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న వారి బంధువులు, కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే ఢిల్లీలో ఉంటున్న తమవారికి ఫోన్ చేసి బాగోగులను ఆరా తీశారు. అయితే తమకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఢిల్లీలో ఉంటున్న కళాకారులు తెలపడంతో బంధువులు, కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.
తహసీల్దార్ వాహన డ్రైవర్‌పై
‘తమ్ముళ్ల’ దాడి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: బత్తలపల్లి మండల తహసీల్దార్ స్వర్ణలత కారు డ్రైవర్ బాషాపై సోమవారం తెలుగు తమ్ముళ్లు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ టీడీపీ నాయకుడు పోలీసుల సహకారంతో ఇసుక అక్రమ రవాణాకు సిద్ధమయ్యాడు. అయితే ఇందుకు తహసీల్దార్ కారు డ్రైవర్ అడ్డు తగిలాడు. గట్టిగా ప్రశ్నిస్తే తహసీల్దార్ పేరు చెప్పి భయపెట్టాడు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నాయకుడు... పోలీసుల నుంచి ఎలాంటి అభ్యంతరం లేకున్నా... మీ(తహసీల్దార్ కార్యాలయం) పెత్తనం ఏమిటని డ్రైవర్ బాషాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయినా ఇసుక అక్రమ రవాణా గురించి డ్రైవర్ బాషా ఆరా తీయడంతో ఆగ్రహించిన టీడీపీ నాయకుడు సోమవారం దంపెట్ల పంచాయతీ కట్టకిందపల్లి, ఉప్పర్లపల్లి గ్రామాల నుంచి 10 మంది టీడీపీ నాయకులను వెంట తీసుకువచ్చి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే డ్రైవర్ బాషాపై దాడి చేశాడు. ఇసుక అక్రమ రవాణాను కప్పిపుచ్చేందుకు ఉప్పర్లపల్లిలో రస్తా సమస్యను సాకుగా చూపుతూ దాడి చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment