కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజైన సోమవారం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వయ్యారాలు ఒలకబోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో కనిపించిన శ్రీవారిని దర్శించుకుని భక్తులు తరించారు. ధగధగ మెరిసే పట్టు చీర ధరించి, గుభాళించే కదిరి మల్లెల అలంకరణలో కనిపించిన ఖాద్రీశుని వైభవాన్ని చూస్తే తప్ప చెప్పటం సాధ్యంకాదు. శ్రీవారి కుచ్చుల వాలు జడ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడగా, అమృతాన్ని పంచడానికి శ్రీమహావిష్ణువే మోహినీ అవతారమెత్తాడని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవ ఉభయదారులుగా కోటా గోపాలకృష్ణయ్య గుప్త కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
భక్తుల వద్దకే వసంతవల్లభుడు
తిరు వీధుల దర్శనానంతరం స్వామివారు రాత్రంతా పట్టణంలో విహరించారు. ఆలయానికి రాలేకపోతున్న తన భక్తుల ఇళ్ల వద్దకే వెళ్లి దర్శనమిచ్చారు. మంగళవారం సాయంత్రం తిరిగి ఆలయం చేరుకొని అలంకరణ అనంతరం ప్రజా గరుడ సేవలో భాగంగా మరోసారి గరుడవాహనంపై తన భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీవారి బ్రహ్మ రథోత్సవం ఈ నెల 20న జరగనుంది. ఆలయ అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
వైభవంగా ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు
మోహినీ అవతారంలో భక్తులకు
దర్శనమిచ్చిన శ్రీవారు
● మోహినీ రూపం.. భక్త పారవశ్యం
● మోహినీ రూపం.. భక్త పారవశ్యం