వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వరుసగా మూడేళ్ల పాటు కృష్ణా జలాలు మడకశిర మండలానికి వచ్చాయి. మడకశిర చెరువును సైతం కృష్ణా జలాలలో రెండుసార్లు నింపారు. దీంతో నియోజకవర్గ రైతులంతా ఎంతో సంతోషించారు. మిగతా మండలాలకు కూడా కృష్ణా జలాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి సర్కార్ ఈప్రాంత రైతులను పూర్తిగా విస్మరించింది.
వైఎస్ జగన్ హయాంలో కృష్ణాజలాలు వదలడంతో
పూర్తిగా నిండి మరువ పారుతున్న మడకశిర చెరువు
మడకశిర: సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న మడకశిర నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి చూసి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలించిపోయారు. 2004లో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ద్వారా నియోజక వర్గానికి కృష్ణా జలాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే హంద్రీనీవా కాలువ పనులను 80 శాతం పూర్తి చేశారు. అయితే ఆయన భౌతికంగా దూరమయ్యాక మడకశిర రైతులను పట్టించున్న వారే కనిపించలేదు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక మడకశిర ప్రాంత రైతుల్లో ఆశలు చిగురించాయి.
వైఎస్ జగన్ చొరవతో..
వైఎస్ జగన్ సీఎం అయ్యాక హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడానికి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర నియోజకవర్గానికి కృష్ణా జలాలను చేరవేయడానికి బైపాస్ కెనాల్‌ను రూపొందించారు. పెనుకొండ నుంచి నేరుగా మడకశిరకు బైపాస్ కెనాల్ నిర్మించడానికి రూ.214.85 కోట్లు మంజూరు చేశారు. ఈ కెనాల్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టేందుకు వీలుగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. వివిధ మండలాల్లో నిలిచిపోయిన హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పనులు పూర్తి చేసేందుకు అధికారులు రూ.70 కోట్లతో ప్రతిపాదనలు పంపగా వైఎస్ జగన్ వెంటనే ఆమోదించి నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నికలు రావడం, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హంద్రీనీవా పథకానికి గ్రహణం పట్టింది.
సమీక్షలకే పరిమితం..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు గడిచింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంపై స్థానిక నాయకులు అధికారులతో పలుసార్లు సమీక్ష చేశారు. సంబంధిత మంత్రి కూడా సచివాలయంలో ఈ పథకంపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు. కానీ నిధుల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం నియోజకవర్గంలో భూగర్భజలమట్టం తగ్గిపోగా బోర్లు పనిచేయడం లేదు. చెరువులకింద ఆయకట్టు పొలాలన్నీ బీళ్లుగా మారుతున్నాయి. దీంతో ఇటీవలే రైతు సంఘం నాయకులు స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రం కూడా ఇచ్చారు. అయినా పాలకుల్లో ఏమాత్రం స్పందన లేదు.
నీరిచ్చే అవకాశం ఉన్నా...
అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాల్లో హంద్రీనీవా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. గుడిబండ మండలం శింగేపల్లి వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి అగళి, రొళ్ల, గుడిబండ మండలానికి ఓ మైనర్ కాలువ, అమరాపురం మండలానికి మరో మైనర్ కాలువ వెళ్తుంది. ఈ మైనర్ కాలువ పనులను పూర్తి చేస్తే అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాలకు కూడా సాగునీరు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. కనీసం ఈ పనులపై కూడా పాలకులు దృష్టి సారించలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా రైతుల సాగునీటి ఘోష పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మడకశిర.. వ్యవసాయం తప్ప మరో ఆధారం లేని ప్రాంతం. వర్షాధారంపైనే ఆధారపడి ఇక్కడి రైతులు పంటలు సాగుచేస్తారు. వర్షాభావ పరిస్థితుల్లో పొలాలన్నీ బీళ్లుగా మారుతాయి. జనమంతా పొట్ట కూటికోసం కర్ణాటకకు వలస వెళ్లాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న వైఎస్ జగన్ నియోజకవర్గంలో కృష్ణా జలాలు పారించి ఈప్రాంత రైతులకు మేలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మడకశిరపై శీతకన్ను వేసింది. సాగునీరు ఇవ్వకుండా రైతులను అష్టకష్టాలు
పెడుతోంది.
మడకశిరలో సాగునీటి ఘోష
నేటికీ పూర్తి కాని హంద్రీ–నీవా పనులు
కృష్ణా జలాలు అందక
పొలాలు బీళ్లు పెట్టిన రైతులు
వైఎస్ జగన్ హయాంలో
మూడేళ్లు పారిన కృష్ణా జలాలు
గత ప్రభుత్వంలోనే ఎంబీసీకి రూ.214.85 కోట్ల మంజూరు
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పనుల పూర్తికి
రూ.70 కోట్లతో ప్రతిపాదనలు
తాజాగా ‘బైపాస్ కెనాల్’కు
మంగళం పాడిన కూటమి ప్రభుత్వం
కాలువ పనులను పూర్తి చేయాలి
అగళి మండలంలో హంద్రీనీవా కాలువ పనులు పూర్తి కాలేదు. వెంటనే ప్రభుత్వం కాలువ పనులను పూర్తి చేసి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి. ముఖ్యంత్రి చంద్రబాబు మడకశిర నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాలువ పనుల పూర్తికి నిధులు మంజూరు చేయాలి. వైఎస్ జగన్ మంజూరు చేసిన బైపాస్ కెనాల్ పనులను కూడా ప్రారంభించాలి.
– చంద్రప్ప, రైతు, మధూడి, అగళి మండలం
హామీ నిలబెట్టుకోవాలి
ప్రస్తుతం అగళి మండలంలో భూగర్భ జలమట్టం భారీగా తగ్గింది. బోర్లలోనూ నీళ్లు రావడం లేదు. కూటమి నేతలు ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు మడకశిర నియోజకవర్గంలో హంద్రీనీవా సాగునీటి పథకాన్ని పూర్తి చేసి అన్ని మండలాలకూ కృష్ణా జలాలు అందించాలి. లేకపోతే సాగునీటి సమస్యతో వ్యవసాయానికి స్వస్తి పలకాల్సి వస్తుంది.
– నాగరాజు, రైతు, అగళి
కూటమి కినుక.. చేను తడవక
కూటమి కినుక.. చేను తడవక
కూటమి కినుక.. చేను తడవక