గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ కానుకల ద్వారా సమకూరిన ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మొత్తం 103 రోజులకు గానూ రూ.66,85,838 లక్షల నగదు, అన్నదానం హుండీ ద్వారా రూ.63,447 నగదు, 37 అమెరికన్ డాలర్లు, నాలుగు గ్రాముల బంగారు, 1.900 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈఓ కె.వాణి తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీరభద్రసేవా సమితి, హనుమాన్ సేవా సమితి, రాఘవేంద్ర సేవా సమితి, శ్రీరామ సేవాసమితి సభ్యులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
మూల్యాంకన కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న పదో తరగతి మూల్యాంకనం కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి కోరారు. ఈ మేరకు డీఈఓ కిష్టప్పను బుధవారం కలసి వినతిపత్రం అందజేశారు. 58 సంవత్సరాలు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మూల్యాంకన విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేంద్రాల్లో ఫ్యాన్లు, లైటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయుల సౌకర్యార్థం సాయంత్రం 4గంటలకు ఈ ప్రక్రియను ముగించాలని కోరారు.
వ్యక్తిపై బీరు బాటిళ్లతో దాడి
ధర్మవరం రూరల్: స్థానిక దుర్గా బార్ అండ్ రెస్టారెంట్‌లో బుధవారం ఘర్షణ చోటు చేసుకుంది. ధర్మవరం మండలం రావులచెరువు గ్రామానికి చెందిన బోగం మహేంద్రపై ధర్మపురి గ్రామానికి చెందిన విష్ణు, మారుతి బీరు సీసాలతో దాడి చేశారు. వీపు, చేతిపై గాజు పెంకులతో బలంగా పొడిచారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు.