పుట్టపర్తి: ఏటా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాల్లో చేర్చి రైతులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కలెక్టర్ టీఎస్ చేతన్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి వినతి పత్రం సమర్పించారు. అలాగే పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు చేపల సంఘంలోని 16 మందిని నాలుగు రోజుల క్రితం బలవంతంగా చెరువులో చేపలు పట్టుకోకుండా గెంటేశారని వారికి న్యాయం చేయాలన్నారు. ప్రస్తుతం ఎలాంటి హక్కులేని వారు చేపలు పట్టి సొమ్ము చేసుకుంటున్నారని కలెక్టర్‌కు తెలిపారు. దీనిపై విచారణ జరిపి సభ్యులందరికీ న్యాయం చేయాలని కోరారు. అనంతరం దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, నల్లమాడ, అమడగూరు మండలాల్లో ఈసారి వర్షాభావం నెలకొందన్నారు. పంటలు పండక రైతులు నష్టాలు మూటగట్టుకున్నారన్నారు. చాలా ప్రాంతాల్లో భూగర్భజలమట్టం దారుణంగా పడిపోగా, బోరుబావుల కింద కూడా వ్యవసాయం సాగలేదన్నారు. పెట్టుబడుల రూపంలో పెట్టిన రూ. కోట్లు రైతుల చేతికి అందలేదన్నారు. అయినా ప్రభుత్వం నియోజకవర్గంలోని ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలను కరువు జాబితాలో చేర్చి రైతులను ఆదుకోవాలని కోరారు. వెంటనే ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందించాలని డిమాండ్ చేశారు.
పరిశ్రమలు స్థాపించాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్నా..జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఒక్క పరిశ్రమను కూడ నెలకొల్పలేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం పరిశ్రమలు స్థాపించే విధంగా అడుగులు వేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పీవీ రమణారెడ్డి, పార్టీ మాజీ మండల కన్వీనర్ నరసారెడ్డి, కన్వీనర్ గంగాద్రి, ఎంపీటీసీ ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
6 మండలాలకు తగిన న్యాయం చేయాలి కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి వినతి