
రెవెన్యూ రాజకీయం!
● జిల్లేడు బండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే ధర్మవరం నియోజకవర్గంలో 23 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి..ఈ ప్రాజెక్టుకు ఇంకా 2 వేల ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. నిర్వాసితులకు భూ పరిహారం చెల్లించాల్సి ఉంది. కానీ రెవెన్యూ అధికారులకు తీరిక లేదు.
● ధర్మవరం పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు కదిరిగేట్ వద్ద రూ.50 కోట్లతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆర్‌ఓబీ కింద ఇళ్లు కోల్పోయే వారికి పరిహారం ఇచ్చేందుకు రూ.30 కోట్లు కూడా విడుదల చేసింది. ఇంకా 23 ఇళ్లకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించేందుకు కూడా రెవెన్యూ అధికారులకు సమయం ఉండటం లేదు.
● బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లోని చిత్రావతి నది పరీవాహక ప్రాంతం నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అవుతోంది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఎందుకంటే ఈ దందా అంతా కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది.
...ధర్మవరం నియోజకవర్గంలో రెవెన్యూ ఉన్నతాధికారుల పనితీరుకు పై ఉదాహరణలే నిదర్శనం. మరైతే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారంటే... అధికారంలో ఉన్న కూటమి నేతల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. వారి సేవలో తరిస్తూ అక్రమాలకు అధికార ముద్ర వేస్తున్నారు. వివాదాస్పద విషయాల్లో తలదూరుస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
ధర్మవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరగానే రెవెన్యూశాఖలోని కొందరు అధికారులు రాజకీయ నేతల్లా వ్యవహరిస్తున్నారు. పోస్టింగ్ ఇప్పించారని కొందరు.. బాగా డబ్బులు ముట్టజెపుతున్నారని మరికొందరు.. చెప్పిన మాట వినకపోతే బదిలీ చేయిస్తారన్న భయంతో ఇంకొందరు రాజకీయ నాయకుల సేవల్లో తరిస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి మద్దతు పలుకుతూ బాధితులకు అన్యాయం చేస్తున్నారు. రస్తా వివాదం ఉందంటే... అధికార పార్టీ సానుభూతిపరులకే ఏకపక్షంగా మద్దతుగా నిలుస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారు. ఫ్రీ హోల్డ్ జీఓలో నిబంధనలు విస్మరించి మరీ అధికార పార్టీ నేతలకు మేలు చేస్తూ సామాన్యులకు అన్యాయం చేస్తున్నారు. చివరకు కోర్టు పరిధిలోని అంశాల్లోనూ తలదూరుస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
అధికార పార్టీ విమర్శలు..రెవెన్యూ చర్యలు..
రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీ నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని చెప్పేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫాంహౌస్ వివాదంలో తలదూర్చడమే ఉదాహరణగా చెప్పవచ్చు. ధర్మవరం మండలం తుంపర్తి సమీపంలో నిర్మించిన ఫాంహౌస్ కోసం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ అధికారపార్టీ నాయకులు ఆరోపిస్తుండగా... వాటిని వాస్తవమని తేల్చేందుకు రెవెన్యూ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఫాంహౌస్ కోసం 40 ఎకరాల అసైన్డ్ భూములు ఆక్రమించారని కూటమి పార్టీల నేతలు కేతిరెడ్డిపై ఆరోపణలు చేశారు. దీనిపై కేతిరెడ్డి ఇప్పటికే పలు మార్లు ఆధారాలతో సహా మీడియా ముఖంగా వివరించారు. దీంతో కూటమి నేతలు తాజాగా 2.50 ఎకరాల అసైన్డ్ భూమిని కొనుగోలు చేశారంటూ రెవెన్యూ అధికారులతో ఎల్లో మీడియాకు లీకులు ఇప్పించారు. వాస్తవానికి కేతిరెడ్డి తన సోదరుడి సతీమణి గాలి వసుమతి పేరిట 1932లోనే భూ యజమాన్య హక్కులు పొందిన రైతుల వారసులతో 25.38 ఎకరాలు మార్కెట్ ధరకు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను కేతిరెడ్డి గతంలో మీడియాకు చూపించారు. దీంతో ఎలాగైనా కేతిరెడ్డి మీద బురదజల్లాలన్న ఉద్దేశంతో కూటమి నాయకులు తాజాగా 2.50 ఎకరాల అసైన్డ్ భూమిని రిజిస్టర్ చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ఆ భూమిని నిబంధనలకు లోబడే అధికారులు రిజిస్టర్ చేశారు. ఇదే విషయమై హైకోర్టులో కేతిరెడ్డి పిటిషన్ వేయడంతో కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. అయినా రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కేతిరెడ్డిపైన బురద జల్లేందుకు రెవెన్యూ డివిజన్‌లో ఓ ఉన్నతాధికారి రాత్రింబవళ్లు శ్రమిస్తూ కింది స్థాయి సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. ఇలా నేతల రాజకీయ పనుల కోసం కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సమయం కేటాయించాలని నియోజకవర్గ ప్రజలు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.
రాజకీయ నాయకుల
కక్ష సాధింపులకే అహర్నిశలు కృషి
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు.. సమస్యలు పరిష్కరించాలని వేడుకోలు
ధర్మవరంలో విస్మయం కల్గిస్తున్న రెవెన్యూ అధికారుల వైఖరి
అభివృద్ధి పనులకు అడ్డంకులున్నా... పట్టించుకోని వైనం