
సుధాకర్.. ఓ అక్రమాల పుట్ట
చిలమత్తూరు: ‘మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి రెండూ రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు లేవు. ఆయనో అక్రమాల పుట్ట’ అంటూ చిలమత్తూరు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం హిందూపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేవంలో ఆయన మాట్లాడారు. సుధాకర్ యాదవ్ నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. చిలమత్తూరు పంచాయతీ తుమ్మలకుంట సమీపంలో సుధాకర్ యాదవ్ తన భార్య పేరిట 3.71 ఎకరాల భూమి కొనుగోలు చేశారని, రూ.కోట్లు విలువ చేసే ఆ భూమిని ఎలా కొనుగోలు చేశారో సమాధానమివ్వాలన్నారు. ఇదే భూమిలో రూ.కోట్ల ఖర్చుతో కోళ్ల ఫారం ఎలా నిర్మిస్తున్నారో కూడా సమాదానం చెప్పాలన్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం ఏకంగా రూ.16 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే సుధాకర్ యాదవ్ అక్రమ సంపాదన ఏపాటిదో అర్థం చేసుకోవచ్చునన్నారు. ఉపాధి నిధులతో అక్రమంగా తన భూమిలో రోడ్డు వేయించుకున్నాడని ఆరోపించారు. తమ భూమి చదును చేయించుకునేందుకు లేపాక్షి నాలెడ్జి భూముల్లో మట్టిని అక్రమంగా తోలించుకున్న సుధాకర్ యాదవ్‌పై పత్రికల్లో పలు కథనాలు వెలువడినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటే ఆయన వెనుక ఎవరున్నారో అర్థమవుతోందన్నారు. ఇన్ని లోటుపాట్లు పెట్టుకుని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఏకవచనంతో సంబోధించడం సిగ్గుచేటన్నారు. అధికార టీడీపీ నేతలను అడ్డు పెట్టుకుని అక్రమ దందాలతో సామాన్య ప్రజలను ఇక్కట్లు పెట్టే ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పురమాయించడం ఆయన అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రోద్బలంతో విచక్షణ కోల్పోయి మాజీ సీఎంను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గంగా మాట్లాడితే సహించబోమన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని, కాలం ఒకేలా ఉండదనే విషయాన్ని ఇప్పటికై నా ఆయన గుర్తించాలన్నారు.
రూ.కోట్ల విలువైన భూమి ఎలా కొన్నావ్?
భారీ ఎత్తున కోళ్లఫారం నిర్మాణం ఎలా చేపట్టావ్?
భూమి చదును కోసం లేపాక్షి నాలెడ్జ్ హబ్
భూముల నుంచి మట్టిని అక్రమంగా తోలుకోలేదా?
చిలమత్తూరు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్
రామకృష్ణారెడ్డి ధ్వజం