
ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో మానవాళికి ముప్పు
పుట్టపర్తి టౌన్: ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో మానవాళికి ముప్పు ఉందని, అందువల్ల గృహాలు, కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులు శాసీ్త్రయ పద్ధతిలో తొలగించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం పంచాయతీ రాజ్, పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ – వ్యర్థాల అనర్థాలను వివరిస్తూ పుట్టపర్తిలో విద్యార్థులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద ర్యాలీకి కలెక్టర్ చేతన్ జెండా ఊపి ప్రారంభించగా, వైజంక్షన్ వరకూ కొనసాగింది. అక్కడ విద్యార్థులు, మహిళలు మానవహారంగా ఏర్పడి ‘స్వర్ణాంధ్ర,–స్వచ్చాంధ్ర’ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా 2022 నాటికి 8 కోట్ల టన్నుల ఈ– వ్యర్థాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొందన్నారు. ఇందులో ఇరవై మిలియన్ల టన్నులు మాత్రమే రీసైక్లింగ్ జరిగినట్లు వెల్లడించిందన్నారు. మిగిలిన ఈ–వ్యర్థాలను అశాసీ్త్రయ విధానంలో తొలగిస్తున్నారని, ఇది మానవాళి మనుగడకు ప్రమాదకరమన్నారు. ప్రజలు తమ ఇళ్లల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన ఈ–వ్యర్థ చెత్త సేకరణ కేంద్రంలో అందజేస్తే వాటిని సరైన రీతిలో రీసైక్లింగ్ చేసి ముప్పు లేకుండా చూస్తారన్నారు. ఈ–వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో తొలగిస్తే వాటినుంచి బంగారు, వెండి, ప్లాటీనం వంటి లోహాలు వెలికి తీయవచ్చన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, కమిషనర్ ప్రహ్లాద, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీఈఓ కృష్టప్పతో పాటు విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.
శాసీ్త్రయంగా తొలగించడం
అందరి బాధ్యత
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర
కార్యక్రమంలో కలెక్టర్ చేతన్