సోషల్ మీడియాలో సరదాగా పోస్టు చేసుకున్న ఫొటోలు ఈ చందమామను అందనంత ఎత్తులో నిలబెడతాయని ఎవరూ ఊహించలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ సరదాగా సాగిన అందమైన ప్రయాణం ఈ చక్కటి చుక్కకు లెక్కకు మించి అభిమానులను సంపాదించి పెట్టింది. జూనియర్ మిస్ ఇండియా బెస్ట్ పర్సనాలిటీగా అవార్డు అందుకున్న మన పలాస అమ్మాయి మల్లా నైనిషా ‘సాక్షి’తో తన మనోభావాలు పంచుకుంది. పలాసలో చిట్స్ వ్యా పారం చేస్తున్న శరత్‌బాబు, సంతోషిరూపాదేవిల మొదటి సంతానమైన ఈ బాలిక రామకృష్ణాపురం వద్ద గల శ్రీ సత్యసాయి విద్యావిహార్‌లో 9వ తరగతి చదువుతోంది. చదువుతూనే ఇతర క్రీడా నృత్య వి భాగాలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడి యాలో పెడుతుండేది. ఆ ఫొటోలను జూనియర్ మిస్ ఇండియా టీమ్ వారు చూసి ఆమెను సంప్రదించారు. అక్కడ మొదలైన ప్రయాణం ఆమె టైటిల్ అందుకోవడం వరకు చక్కగా సాగిపోయింది.
మీకు విశాఖలో ఆడిషన్‌కు పిలుస్తారని ముందుగానే అనుకున్నారా?
లేదు. అనుకోకుండా ఫోను వచ్చింది. డాడీతో మాట్లాడిస్తాను అని చెప్పాను.
ఆడిషన్‌కు వెళ్లేటప్పుడు మీరు ఏం అనుకున్నారు. మీ కాన్ఫిడెన్స్ ఏమిటి?
ఇక్కడ వరకు వస్తాను అనుకోలేదు. ఒక సారి వెళ్లి చూస్తాను అనుకొని వెళ్లాను.
ఆడిషన్ ఎలా జరిగింది?
వాళ్లు ఇచ్చిన పాటకు నృత్యం చేశాను. ర్యాంప్ వాక్ చేశాను. ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను.
అక్కడ జడ్జ్‌లు ఎవరో తెలుసా?
తెలియదు.
విశాఖ ఆడిషన్ తర్వాత ఏమైంది?
కొద్ది రోజుల తర్వాత ఆంధ్రా తెలంగాణ కలిపి హైదరాబాద్‌లో జూనియర్ మిస్ ఇండియా పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో 52 మంది పాల్గొన్నారు. అక్కడ కూడా డ్యాన్స్, ర్యాంప్ వాక్, ప్రశ్నలు సమాధానాలు జరిగాయి. అందులో షో టాపర్‌గా సెలెక్టయ్యాను.
ముంబై వరకు వెళ్తాను అనుకున్నారా?
టాపర్‌గా నిలిచాను కాబట్టి కొంతమంది నాకు ఆ అవకాశం ఉంటుందని చెప్పారు. అప్పుడు కొద్దిగా ఆశించాను. పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.
మంబైకి ఎప్పుడు వెళ్లారు?
ముంబైలోని నెస్‌కో సెంటర్‌కు ఈ నెల 21న చేరుకున్నాం. అక్కడ రెండురోజుల్లో ఉండాల్సిన ఈవెంట్స్, నిబంధనల గురించి చెప్పారు. వచ్చిన వారందరికీ ట్రైనింగ్ అదే రోజు ఇచ్చారు. 22, 23వ తేదీల్లో పోటీలు జరిగాయి.
అంత దూరం వెళ్లడానికి మీ వెనుక ఉండి నడిపించినదెవరు?
మా మమ్మీ డాడీయే.
ఈ పోటీలకు ఎంతమంది హాజరయ్యారు?
దేశం మొత్తం మీద 120 మంది పాల్గొన్నారు. మొదటి రోజు 22న టాలెంట్ రౌండు, ఆ తర్వాత ఇంటరాక్షన్, తర్వాత కల్చరల్ రౌండు జరిగింది. 23న వెస్ట్రన్ వేర్ ర్యాంప్ వాక్ జరిగింది. అలాగే ప్రిన్సెస్ గౌన్ ర్యాంప్ వాక్ జరిగాయి. ఈ ఈవెంట్స్‌లో నేను పాల్గొన్నాను. నాకు ఇందులో బెస్ట్ పర్సనాలిటీ టైటిల్ ఇచ్చారు.
మీ జీవిత లక్ష్యం
నా ఎడ్యుకేషన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు కావలన్నది మొదటి లక్ష్యం. ఆ తర్వాత అదృష్టం, అవకాశం ఉంటే ప్రపంచ సుందరి పోటీలకు వెళ్లాలనేది గోల్.
Comments
Please login to add a commentAdd a comment