చారిత్రక ఉత్సవానికి సన్నద్ధం
జలుమూరు: చారిత్రక ఉత్సవానికి శ్రీముఖలింగం ముస్తాబవుతోంది. నాటి కళింగ సామ్రాట్ అనంత వర్మచోడ గంగదేవుని పట్టాభిషేక ఉత్సవం జరిగి 946 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో 947వ పట్టాభిషేక మహోత్సవాన్ని ఈ నెల 17న నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఒడిశా రాష్ట్రం పర్లాఖిముండి గజపతి రాజభవనం వద్ద నిర్వాహకులు ఉత్సవాల పోస్టర్ విడుదల చేశారు. కళింగ రాజధానిగా వెలుగొందిన శ్రీముఖలింగం(కళింగ నగరం) తూ ర్పు గంగ వంశపరిపాలనలో గొప్ప ఘనత సాధించింది. ఈ వంశకాలంలో కళింగ సామ్రాజ్యం ఉత్తరంలో గంగానది నుంచి దక్షిణంలో గోదావరి వర కూ విస్తరించింది. సైనిక, సాంస్కృతిక, శిల్పకళా వైభవంలో కళింగ సామ్రాజ్యం ఓ వెలుగు వెలిగింది.
పూరి మొదలు శ్రీకూర్మం వరకు..
పూరి జగన్నాథ ఆలయానికి చోడగంగదేవుని పాలనలో పునాది పడింది. అయితే నిర్మాణం పూర్తికాలేదు. తర్వాత వచ్చిన రాజులు దీనిని పూర్తి చేశారు. శ్రీముఖలింగం దేవాలయం మొదటి కామర్నవ దేవుడు నిర్మించగా అనంత వర్మ వజ్రహస్తకుడు దేవుడు(చోడగంగదేవుని తాత) పూర్తి చేశాడు. చోడ గంగదేవుడు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశాడు. శ్రీముఖలింగం కళింగ సంస్కృతికి ముఖ్య కేంద్రం. ఇక్కడ శాసనాలు ఆయన పాలన విధానాన్ని వివరింగా చెబుతాయి.
హరిహరుల భక్తుడు..
జగన్నాథుడి భక్తుడిగా ప్రసిద్ధి చెందిన చోడ గంగదేవుడు శైవభక్తుడు కూడా. మధుకేశ్వర దేవాలయానికి పెద్ద మొత్తంలో దానాలు ఇచ్చినట్లు శాసనా లలో పొందుపరిచి ఉంది. ఇతను ముందు శైవుడు.. తర్వాత వైష్ణువుడయ్యాడని కొంతమంది చరిత్రకారులు అంటారు. నిజానికి ఇతను రెండింటికీ ప్రాధాన్యమిచ్చారు. శ్రీకూర్మం(కూర్మనాథస్వామి) ఆలయంతో పాటు ఒడిశాలో అనేక శైవ, వైష్ణ ఆలయాలకు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. 70 ఏళ్లకు పైగా కళింగ రాజ్యాన్ని పరిపాలించిన ఈయన భారతదేశంలో గొప్ప రాజులలో ఒకరిగా నిలిచిపోయారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అనంత వర్మ చోడ గంగదేవుడు పట్టాభిషేకం 946 ఏళ్ల తర్వాత మరోసారి శ్రీముఖలింగంలో నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సమర్థవంతమైన పాలన..
అనంత వర్మ చోడ గంగదేవుడు కళింగ రాజ్యాన్ని ఎక్కువ కాలం అంటే సుమారు 70 ఏళ్లకు పైబడి సమర్థంగా పాలించారు. కళింగ రాజ్యంతో పాటు మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో సింహాచలం, శ్రీకూర్మ దేవస్థానం, అరసవల్లి, శ్రీముఖలింగం, ఒడిశాలో కూడా ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారు. శ్రీముఖలింగం రాజధానిగా పరిపాలన చేస్తూ కటక్‌ను కూడా రాజధానిగా మార్చి మంచి పాలన అందించారు.
– కొల్లూరి సూర్యనారాయణ, ఆర్కియాలజీ విశ్రాంత ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీ
నేటి తరాలకు తెలియాలి..
శ్రీముఖలింగం అత్యంత చారిత్రాక, ఆధ్యాత్మిక ప్రదేశం. వేల సంవత్సరాల నాటి పూర్వవైభవం మళ్లీ తెస్తున్నందుకు సంతోషం. దీర్ఘకాలం పాలన చేసిన అనంత వర్మ చోడ గంగ దేవుడు చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పురాతన, మరెన్నో విశేషాలు శ్రీముఖలింగంలో ఉన్నాయి. నాటి కళింగ రాజ్యం రాజధానిగా చేసుకొని పాలన చేసిన రాజు వైభవం పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియనుంది.
– డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు, పలాస
17న శ్రీముఖలింగంలో అనంత వర్మ చోడ గంగదేవుడి పట్టాభిషేకం
సన్నాహాలు చేస్తున్న నిర్వాహకులు
ఇదీ ఘన చరిత్ర
అనంత వర్మ చోడ గంగదేవుడు గంగ వంశాధిపతి. శ్రీముఖలింగం దేవాలయం నిర్మాణానికి బలమైన ఆధారాన్ని అందించిన రాజు. ఇతను తండ్రి దేవేంద్రవర్మ రాజరాజా, తల్లి రాజరాజాదేవి. ఈమె చోళ రాజ కుమార్తె. గంగ, చోళ వంశాల కలయికలో జన్మించిన చోడగంగదేవుడు చాలా శక్తివంతమైన పరిపాలకుడు. ఇతను తన సామ్రాజ్యాన్ని ఒడిశా,(ఆదికాలంలో కళింగ), ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని ప్రాతాలను తన నియంత్రణలోకి తెచ్చాడు. బలమైన సైనికుడుగా తన రాజ్యాన్ని స్థిరంగా ఉంచాడు. అంతే కాకుండా యుద్ధవీరుడిగానూ పేరుగాంచాడు. పాలన ప్రారంభంలో కొన్ని కష్టాలు కూడా ఎదురయ్యాయి. చోళ రాజు కులోత్తుంగతో పలు యుద్ధాలు చేశాడు. తిరిగి రాజ్యాన్ని బలపరుచుకొని ఉత్కళ దేశాన్ని సైతం తన గుప్పెట్లో ఉంచుకున్నాడు.
చారిత్రక ఉత్సవానికి సన్నద్ధం
చారిత్రక ఉత్సవానికి సన్నద్ధం
చారిత్రక ఉత్సవానికి సన్నద్ధం
చారిత్రక ఉత్సవానికి సన్నద్ధం
చారిత్రక ఉత్సవానికి సన్నద్ధం
Comments
Please login to add a commentAdd a comment