గంజాయి స్మగ్లర్లు అరెస్టు
ఇచ్ఛాపురం : ఒడిశా నుంచి కర్ణాటకకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. ఇచ్ఛాపురం సీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం చిక్కమంగుళూరు జిల్లా రాఘవేంద్రనగర్ గ్రామానికి చెందిన ముజామిల్.. ఉప్పలి హిరేకోలలే రోడ్డుకు చెందిన మహ్మద్ సిరాజుద్దీన్‌లు కలిసి బెంగళూరులోని ఇందిరానగర్‌లో నివాసముంటున్నారు. గంజాయికి బానిసయ్యారు. డబ్బు సంపాదనకు గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకొన్నారు. ఈ క్రమంలో బెంగళూరులో గంజాయి అక్రమ వ్యాపారం చేస్తున్న విజయ్‌కుమార్‌కు గంజాయి ఇచ్చేందుకు ఒడిశా వెళ్లారు. ఖందమాల్ జిల్లా ఫుల్బాని ప్రాంతానికి చెందిన భరత్ డింఘాల్ వద్ద 18.310 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. బరంపురం నుంచి బస్సులో బయలుదేరి ఇచ్ఛాపురం బస్టాండ్‌కి శుక్రవారం చేరుకున్నారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా స్టేషన్ సమీపంలో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా జరగకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్న ఇచ్ఛాపురం సర్కిల్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి అభినందించినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, పట్టణ ఎస్సై ముకుందరావు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు,.
2 కిలోల గంజాయి స్వాధీనం
కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్ సిబ్బంది క్వార్టర్స్ సమీపంలో 2.080 కిలోల గంజాయితో ముగ్గురిని కంచిలి పోలీసులు శుక్రవారం సాయంత్రం పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం సుర్లా జంక్షన్‌లో గంజాయి కొనుగోలు చేసి చైన్నెకు రైలులో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వీరు పట్టుబడ్డారు. ఈ మేరకు కాశీబుగ డీఎస్పీ వి.వెంకట అప్పారావు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన అజిత్ లారీ క్లీనర్‌గా పని చేస్తూ కోల్‌కతాకు లోడ్‌తో వచ్చినప్పుడు ఒడిషా రాష్ట్రం సుర్లా జంక్షన్ వద్ద టిఫిన్ షాప్ వద్ద ఆపేవాడు. ఈ క్రమంలో బలియాగూడకు చెందిన బొద్ది సోమేశ్‌తో పరిచయం ఏర్పడింది. అక్కడ అతను చాలా మంది డ్రైవర్లు, క్లీనర్లకు గంజాయి అమ్మేవాడు. అజిత్‌కు గంజాయి తాగే అలవాటు ఉండటంతో సోమేష్ వద్ద గంజాయి కొనుక్కొని తాగేవాడు. ఈ క్రమంలో రెండు, మూడుసార్లు కొనుక్కొని చైన్నెకి తీసుకెళ్లేవాడు. అక్కడ చిన్నచిన్న పొట్లాలుగా చేసి అమ్మేవాడు. లాభాలు రావడంతో తన స్నేహితుడు కమలుద్దీన్ కూడా గంజాయి వ్యాపారం చేయాలని ఆశతో అజిత్‌ను అడగ్గా ఇద్దరూ ఈ నెల 11న చైన్నె నుంచి బయలుదేరి 13వ తేదీ వేకువజామున సుర్లా జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ సోమేశ్‌ను కలిసి కేజీ రూ.10వేలు చొప్పున రెండు కేజీల గంజాయి కావాలని కోరారు. అందుకు సోమేష్ ఒప్పుకుని 14వ తేదీ సాయంత్రం సోంపేట రైల్వేస్టేషన్ వద్దకు వస్తే అక్కడ 2 కేజీల గంజాయి అందిస్తానని చెప్పాడు. దీంతో అజిత్, కమలుద్దీన్‌లు 13వ తేదీ రాత్రి ఇచ్ఛాపురం రైల్వేస్షేషన్ వద్ద బసచేసి 14వ తేదీ సాయంత్రం అప్పగిస్తుండగా కంచిలి పోలీసులకు దొరికిపోయారు. కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు, సిబ్బంది దాడి జరిపి నిందితులు సుర్లా జంక్షన్‌కు చెందిన బి.సోమేష్, చైన్నెకు చెందిన అజిత్, కమలుద్దీన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, 2.080 కిలోల గంజాయి, నల్లటి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోంపేట సీఐ బి.మంగరాజు, కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు పాల్గొన్నారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్‌ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
గంజాయి పట్టివేత
టెక్కలి రూరల్: టెక్కలి సమీప తోటల్లో శుక్రవారం గంజాయి తాగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి కొందరిని అదుపులో తీసుకున్నట్లు సమచారం. కొంత గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
18 కేజీల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం
ఒడిశా నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment