ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ బస్సులు డ్రైవింగ్ చేసిన సమయంలో విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటో డిపో గ్యారేజీ ఆవరణలో జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.విజయకుమార్ అధ్యక్షతన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ నిజాయితీ, అంకితభావం, క్రమశిక్షణతో డ్రైవింగ్ చేయాలన్నారు. ప్రాంతీయ రవాణా అధికారి రాజు మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ల సేవలను కొనియాడారు. ప్రజా రవాణా అధికారి ఏ.విజయకుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. అనంతరం శ్రీకాకుళం 1, 2 డిపోలు, టెక్కలి, పలాస డిపోలలో సుదీర్ఘకాలం ప్రమాద రహిత రికార్డు కలిగిన డ్రైవర్లు బి.వి.ఆర్.మూర్తి, వై.జి.రావు, కె.రమణలకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం 1–2 డిపో మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్‌ఎస్ శర్మ, టెక్కలి డీఎం శ్రీనివాసరావు, పలాస డిపో మేనేజర్ సన్యాసిరావు, సూపర్‌వైజర్లు, అసోసియేషన్ నాయకులు, భద్రతా దళం – నిఘా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
చిన్నారులతో
స్నేహపూర్వకంగా మెలగాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారులతో స్నేహపూర్వకంగా మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. బాలల రక్షణ, సంక్షేమం, జువైనల్ జస్టిస్ బోర్డు పనితీరు, పిల్లల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై శనివారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. జేజేబీ పనితీరు, ప్రీ లోక్ అదాలత్ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం 12 కేసులు రాజీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు మంచు జనార్దనరావు, ఎన్ని సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
సీబీఎస్‌ఈ పరీక్షలు ప్రారంభం
శ్రీకాకుళం రూరల్: కేంద్రీయ విద్యాలయంలో సీబీఎస్‌ఈ సిలబస్‌కు సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ సోయాబ్ అలామ్ తెలిపారు. పాఠశాలకు చెందిన 119 మంది విద్యార్థులతో పాటు గాయాత్రీ స్కూల్‌కు చెందిన మరో 87 మంది ఇదే కేంద్రంలో పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సీసీ కెమెరాల పర్యవేక్షణలో అన్ని వసతుల మధ్య ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి మొదటి వారంలో బాలవాటిక నోటిఫికేషన్ ఉంటుందన్నారు. రెండో తరగతి నుంచి 9వ తరగతి వరకూ వ్యాకెన్సీ పొజిషన్ కూడా త్వరలో విడుదలవుతుందని చెప్పారు.
రక్షిత మంచినీటి పథకంలో క్లోరినేషన్
టెక్కలి రూరల్: స్థానిక ఆదిఆంధ్ర వీధి సమీపంలోని ఎర్రన్నాయుడు రక్షిత మంచినీటి పథకం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడి శుక్రవారం ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ నీటినే వీధి కుళాయిల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం శ్యాంపిల్ టెస్ట్ నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో సమ్మర్ ట్యాంక్‌లో క్లోరినేషన్ చేపట్టారు. పరిసరాల్లో జంగిల్ క్లియరన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామీణ నీటి పరఫరా విభాగం డీఈ రామకృష్ణ, ఏఈ మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment