పరిసరాల శుభ్రత సామాజిక బాధ్యత
టెక్కలి: పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి సామాజిక బాధ్యతని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పంచాయతీ పరిశుభ్రతపై శనివారం టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తితో కలిసి టెక్కలిలో పర్యటించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. నిర్వహణ తీరు సరిగ్గా లేకపోవడంతో ఈఓ జగన్నాథంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సమీప ఇళ్ల వద్దకు వెళ్లి తడి చెత్త పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. పట్టుమహదేవి కోనేరును పరిశీలించి పార్కుగా చేసే క్రమంలో పూర్తి స్థాయి నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టెక్కలి పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పంచాయతీను సుందరంగా తీర్చిదిద్దేందుకు పారిశుద్ద్య కార్మికులు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ భారతి సౌజన్య, వంశధార డీఈఈ శేఖర్‌బాబు, డ్వామా ఏపీడీ శైల జ, జిల్లా వనరుల కేంద్రం కోఆర్డినేటర్ నిశ్చల, ఎంపీడీఓ సీహెచ్.లక్ష్మీబాయి, డీఎల్‌పీఓ గోపి బాల, ఏపీఎం బి.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment