ట్రాక్టర్ బోల్తాపడి రైతు దుర్మరణం
పొందూరు/ఆమదాలవలస రూరల్: : ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందిన ఘటన ఆమదాలవలస మండలం బెలమాం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పొందూరు మండలం తాడివలసకు చెందిన తమ్మినేని భాస్కరరావు(51) తనకు ఉన్న ఎకరా పొలంతో పాటు సుమారు ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి దుక్కులు దున్నడం, పొలం పనులు చేయడం వంటి పనులు చేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం ఉదయం 5 గంటలకు వ్యవసాయ పనుల కోసం సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న ఆమదాలవలస మండలం బెలమాం గ్రామంలోని పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్‌పై వెళ్లాడు. పొలం లోతట్టులో ఉండటంతో ట్రాక్టర్ బోల్తా పడి భాస్కరరావు కిందనే చిక్కుకుపోయాడు. స్థానికులు గుర్తించి బయటకు తీసేసరికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న భార్య రమణమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమదాలవలస ఎస్సై బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
ట్రాక్టర్ బోల్తాపడి రైతు దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment