తిలోదకాలు | - | Sakshi
Sakshi News home page

తిలోదకాలు

Published Mon, Feb 17 2025 12:48 AM | Last Updated on Mon, Feb 17 2025 12:43 AM

తిలోదకాలు

తిలోదకాలు

సర్వీస్‌ రూల్స్‌కు..
● బీసీ సంక్షేమశాఖ రూటే సెప‘రేటు’ ● నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. ఆపై పదోన్నతులు ● ముడుపులు చెల్లిస్తే అక్రమాలన్నీ సక్రమాలే

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: బీసీ సంక్షేమ శాఖలో సర్వీస్‌ రూల్స్‌కు తిలోదకాలిస్తున్నారు. ఉన్నతాధికారుల పేరు చెప్పి కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ఏ ప్రభుత్వ శాఖలోనూ లేనివిధంగా ఇక్కడ పదోన్నతుల వ్యవహారం సాగుతోంది. అటెండర్‌ (ఆఫీస్‌ సబార్డినేట్‌)గా విధుల్లోకి చేరిన వారు, కుక్‌గా చేరిన వారు ఒక్క సారిగా మూడు కేడర్లు దాటి వసతి గృహ సంక్షేమాధికారిగా పదోన్నతులు పొందుతున్నారు. కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు.. ఆ సర్టిఫికెట్‌ నకిలీదా వాస్తవమైనదా అన్నది పరిశీలించకుండానే పదోన్నతులు కట్టబెట్టేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి ఉన్నతాధికారులకు డబ్బులు చెల్లించి ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారు, అడ్డగోలుగా పదోన్నతులు పొందిన కొందరు ఉద్యోగులు విధులకు డుమ్మాకొట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

●2006లో జీఓ 36 ప్రకారం 10 శాతం ప్రమోషన్లు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో జారిచేసింది. అప్పటికి అర్హత ఉన్నవారి ప్రకారం 8 మందికి పదోన్నతులు కల్పించాల్సింది. అయితే ఈ జీవోని తుంగలోకి తొక్కి అధికారులే సొంత జీవోను తయారు చేసుకొని కాసులకు కక్కుర్తి పడి ఏకంగా 25 మంది కింది స్థాయి ఉద్యోగులకు వార్డెన్లుగా (హెచ్‌డబ్ల్యూఓ) పదోన్నతులు కల్పించారు. ఈ ఖాళీలు ఎక్కడి నుంచి వచ్చాయో..ఏ జీవో ప్రకారం పదోన్నతుల కల్పించారో వారికే ఎరుక. ఇటువంటి పదోన్నతుల పర్యవసానంగానే గతంతో ఇక్కడ జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారికి ఇప్పటికీ పెన్షన్‌ రాలేదు. అంతేకాకుండా ఆ కేసులు కూడా తేలలేదని కార్యాలయ సిబ్బందే చెబుతున్నారు. ఆ తర్వాత డీబీసీడబ్ల్యూఓగా వచ్చి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిణి కి కూడా కేసుల బెడద తప్పలేదు.

● జీవో ప్రకారం పదోన్నతి పొందిన వారు మూడేళ్లలోపే బీఈడీ పూర్తి చేయాలి. అలా పూర్తి చేయకపోతే తిరిగి సబార్డినేట్‌ పోస్టుకి వెళ్లాలి. ఇక్కడ మాత్రం పదోన్నతి పొందడమే తప్ప ఆ తర్వాత పట్టించుకునే వారే కరువయ్యారు. ఒక వేళ ఎవరైనా డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చినా అవి నిజమైనవా నకిలీవా అన్న దర్యాప్తు కూడా చేపట్టడం లేదు.

● ఏ ఉద్యోగికై నా పదోన్నతి పొందాక రెండేళ్లలోపు డిపార్ట్‌మెంట్‌ టెస్టులు రాయాలి. అంటే ఎస్‌ఓ–1 ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే పాత కేడర్‌కే రివర్ట్‌ చేయాల్సి ఉంది. ఆ నిబందన కూడా ఈ శాఖలో ఇప్పటి వరకు అమలు కావడం లేదు. ఇటువంటి వాటిని ఆ ఉద్యోగులకు బూచిగా చూపించి కొందరు జిల్లా స్థాయి అధికారులు డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీ సంక్షేమశాఖలో డబ్బులిస్తే చాలు ఉన్నతాధికారులను, ఆపై ఉన్నతాధికారులను తప్పుతోవ పట్టించడంలో కొందరు ఘనాపాటిలు ఈ శాఖలో తిష్ఠ వేశారు.

● బీసీ సంక్షేమశాఖలో ముఖ్యంగా జోన్‌–1లో రూల్‌ 16 హెచ్‌ నడుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో 2008లో సీనియారిటీ లిస్ట్‌ ఇచ్చారని, మరలా ఇప్పటివరకు ఇవ్వకపోవడం దారుణమని వార్డెన్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు రూల్‌ 16హెచ్‌ పక్కను పెట్టి సీనియారిటీ పేరిట కొత్తగా అవినీతి పదోన్నతులు పేరిట ఫైల్‌ను తయారుచేసి మరోసారి కలెక్టర్‌, ఇతర అధికారులను తప్పుతోవ పెట్టించే ప్రయత్నం ఈ శాఖలో మొదలైందని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. తప్పుడు పదోన్నతులు ఇవ్వడం ఈ శాఖకు అలవాటుగా మారిందని ఆ ఆద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● సెటిల్డ్‌ సీనియారిటీ మార్చే అధికారం ఎవరికీ లేదు. 2008లో ఇచ్చిన సెటిల్డ్‌ సీనియార్టిని ఒక వేళ మార్పు చేయాలంటే మూడేళ్లలోపే మార్చే అధికారం ఉంటుంది. అప్పుడు చేయకుండా ఇప్పుడు మార్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

● లావేరులో పనిచేసిన ఓ అటెండర్‌ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో వార్డెన్‌గా పదోన్నతి పొందినట్లు ఆ శాఖ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఆయనతో పాటు పదోన్నతి పొందిన ఇద్దరు ఉద్యోగ విరమణ పొందినా క్రమశిక్షణ చర్యలు క్రింద పెన్షన్‌ నిలుపుదల చేశారు. దీనిని బట్టి కొంతమందికే క్రమశిక్షణా చర్యలు, మరికొంతమందికి మినహాయింపులు ఉంటాయనేది అర్ధం చేసుకోవచ్చు.

● ప్రధానంగా జిల్లా అధికారికి, కార్యాలయ సిబ్బందికి, అస్మదీయులకు అనుకూలంగా ఫైల్‌ తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నష్టపోయినవారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే సమస్యలు, వివాదాలతో కూనరిల్లుతున్న ఈ సంక్షేమ శాఖ మరింత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ శాఖ జిల్లా కార్యాలయంలో అధిక శాతం మంది కారుణ్య నియామకం పొందినవారే. వారికి సర్వీస్‌ రూల్స్‌పై అవగాహన లేకపోవడం, అధిక వేతనంపై ఆశతో తప్పులమీద తప్పులు చేస్తున్నారని ఆ శాఖలో కొంతమంది ఉద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement