డీఎస్సీ–2003 టీచర్లకు పాతపెన్షన్ అమలు చేయాలి
శ్రీకాకుళం అర్బన్:
డీఎస్సీ–2003 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డీఎస్సీ–2003 ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఫోరం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ వెలువడిన 2003 సమయంలో సీఎంగా చంద్రబాబునాయుడే ఉన్నారని.. ఆరోజు నియామకాల జాప్యానికి నాటి ప్రభుత్వాలే కారణమని చెప్పారు. ప్రభుత్వ జాప్యానికి ఉపాధ్యాయులను బలిపశువులను చేయడం తగదని.. పాతపెన్షన్‌ను అమలు చేయకుటే ఉద్యమబాట పడతామని ఫోరం ప్రతినిధులు స్పష్టంచేశారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న కళింగభవన్‌లో డీఎస్సీ 2003 ఉత్తరాంద్ర ఫోరం ఆధ్వర్యంలో మెమో 57 ఉద్యోగ ఉపాధ్యాయ సాధన సమితి సమావేశం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర కన్వీనర్ మోపిదేవి శివశంకర్ మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్ 2003 నవంబర్ 13న విడుదలైనప్పటికీ నియామకాలు 2005 నవంబర్లో చేపట్టి.. రెండేళ్లపాటు ప్రభుత్వం జాప్యం చేసిందని, తమను బలవంతంగా సీపీఎస్ విధానంలోకి నెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నియమితులైన 7361 మంది ఉపాధ్యాయులకు, హోంశాఖ కు చెందిన 1800 మంది కానిస్టేబుళ్లకు, గ్రూప్–2, గ్రూప్–1, హెల్త్ విభాగానికి చెందిన 1800 మందికి మొత్తం 11,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్తింపచేసి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఇది ఆర్థిక భారమైన డిమాండ్ కాదని.. న్యాయబద్ధమైన సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని దానికి అవసరమైన అన్ని రకాల సహకారం ఏపీ ఎన్‌న్జీవో సంఘం తరఫున అందిస్తామన్నారు. ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు దుప్పల శివరాంప్రసాద్ మాట్లాడుతూ మెమో 57 ప్రకారం 15 రాష్ట్రాలు పాత పెన్షన్ విధానం అమలు చేశాయన్నారు. ఇక్కడ అమలు చేసి 16వ రాష్ట్రంగా నిలవాలని కోరారు. ఫోరం జిల్లా కన్వీనర్ పి.శ్రీహరి మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా మన రాష్ట్రం నిలవాలన్నారు. సమావేశంలో సుబ్బారెడ్డి, విజయనగరం కన్వీనర్ రవి, విశాఖ కన్వీనర్ షేక్ మహ్మద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు గాదె శ్రీనివాసులునాయుడు, కోరేడ్ల విజయ్‌గౌరి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment