శ్రీకాకుళం: మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు పూర్తిస్థాయి లో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం అన్నారు. ఆదివారం జిల్లా ఇంటర్మీడియెట్ అధికారులతో ఆర్ట్స్ కళాశాలలోని ప్రాంగణంలో గల ఆర్‌ఐఓ కార్యాలయంలో జిల్లా పర్యవేక్షణ అధికారి, పరీక్ష కమిటీ సభ్యులు, ప్రిన్సిపాళ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో ఆయన సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పి.దుర్గారావు మాట్లాడుతూ మొదటి, రెండో సంవత్సర విద్యార్థులకు 75 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొదటి ఏడాది 20,389 మంది, రెండో ఏడాదికి 19,967 మంది పరీక్ష రాస్తారని తెలిపారు. పర్యవేక్షణకు 1600 మంది ఇన్విజిలేటర్లు, 1480 సీసీ కెమెరాలు అమర్చుతున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షా కమిటీ సభ్యులు భీమేశ్వరరావు, నారాయణరావు, సింహాచలం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment