పట్టపగలు చోరీచేసింది పక్కింటోడే..
శ్రీకాకుళం క్రైమ్: గత నెల 22న గార మండలం శాలిహుండంలోని ఓ పండ్లవ్యాపారి ఇంట్లో పట్టపగలు జరిగిన చోరీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాధితుడి ఇంటి పక్కన నివాసముంటున్న ఆటోడ్రైవరే ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.
నాలుగో ప్రయత్నంలో..
శాలిహుండం గ్రామానికి చెందిన ఉర్జాన ఆదినారాయణ, రమణమ్మలు సింగుపురం కూడలి వద్ద పండ్ల వ్యాపారం చేస్తుంటారు. ఉదయం వెళ్తే రాత్రి వరకు తిరిగిరారు. జనవరి 22న ఎప్పట్లాగే ఉదయం ఏడు గంటలకు వ్యాపారానికని వెళ్లిన దంపతులు రాత్రి ఎనిమిదిన్నరకు వచ్చేసరికి వెనుక తలుపులు తీసివున్నాయి. వాస్తవానికి దంపతులే తలుపులు వేయడం మరిచారు. రమణమ్మ తాను వేసుకున్న బంగారు గాజులు, గొలుసు బీరువాలో పెట్టడానికి తాళాలు వెతకగా కనిపించకపోవడంతో షరాబుని పిలిపించి తెరిపించింది. బీరువాలో తన ఇద్దరు కుమార్తెలకు చెందిన ఆరు తులాల గొలుసు, నాలుగు తులాల హారం, రెండున్నర తులాల నక్లెస్, రెండు తులాల వొంటిపేట గొలుసు కనిపించకపోవడంతో నిర్ఘాంతపోయింది. వెంటనే గార స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ జనార్దన దర్యాప్తు చేపట్టారు. స్థానికుల పనేనని గుర్తించి ఓ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టారు.
అప్పుల బెడద ఎక్కువై..
రమణమ్మ పక్కింట్లో నివాసముంటున్న జోగి రాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యాబిడ్డలను పోషిస్తున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఉదయం వెళ్లి రాత్రి వరకు తిరిగి రాని రమణమ్మ ఇల్లే దొంగతనానికి సరైనదని భావించి రెండు, మూడుసార్లు ప్రయత్నించాడు. నాలుగోసారి గత నెల 22న చోరీ చేశాడు. చోరీ సొత్తును రాజు తన ఇంటి మేడపైన హోమ్ థియేటర్ స్పీకర్ బాక్సుల్లో దాచాడు. అప్పుల వారి తాకిడి ఎక్కువైపోవడంతో ఈ నెల 16న మధ్యాహ్నం 3 గంటలకు ఆరు తులాల ఆభరణాలు తనఖా పెట్టేందుకు బయల్దేరాడు. అప్పటికే రాజుపై నిఘా పెట్టిన పోలీసులు అతన్ని ఇంటివద్దే అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయాన్ని బయటపెట్టాడు.
ప్రతిభకు ప్రశంసలు..
కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సీఐ సీహెచ్ పైడపునాయుడు, ఎస్‌ఐ జనార్దన, వన్‌టౌన్ ఎస్‌ఐ హరికృష్ణ, ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, పీసీలు సూరిబాబు, జగదీష్, రమణమూర్తి, బాలకృష్ణలను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుని వద్ద మొత్తం సొత్తును రికవరీ చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
వీడిన శాలిహుండం చోరీ కేసు మిస్టరీ
పండ్లవ్యాపారి ఇంట్లో 17 తులాలకు పైగా ఆభరణాలు మాయం చేసిన ఆటోడ్రైవర్ అరెస్టు
పట్టపగలు చోరీచేసింది పక్కింటోడే..
Comments
Please login to add a commentAdd a comment