పకడ్బందీగా పబ్లిక్ పరీక్షలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నందున ఎటువంటి మాస్ కాపీయింగ్, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రథమ చికిత్స కేంద్రాలను సిద్ధం చేసి పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. రెవిన్యూ డివిజనల్ అధికారులు వారి స్థాయిలో సమావేశం నిర్వహించాలని సూచించారు.
● సెకండరీ ఎడ్యూకేషన్ బోర్డు పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. జిల్లాలో 28,984 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. 149 కేంద్రాలకు 149 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
● ఏపీ సార్వత్రిక విద్యా సంస్థ నిర్వహించే ఓపెన్ స్కూల్ పదోతరగతి పరీక్షలు కూడా ఎస్‌ఎస్‌సీ పరీక్షల సమయంలోనే జరగనున్నాయని కలెక్టర్ చెప్పారు. 807 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, జిల్లాలో 8 కేంద్రాలకు ఎనిమిది మంది చీఫ్ సూపరింటెండెంట్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
● ఓపెన్ ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయని కలెక్టర్ తెలిపారు. 1553 మంది హాజరు కానున్నారని చెప్పారు. 8 కేంద్రాలకు 8 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు.
● జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య మాట్లాడుతూ పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయిప్రత్యూష, ఏసీఈ లియాఖత్ అలీఖాన్, జిల్లా ఒకేషనల్ అధికారి తవిటినాయుడు, జిల్లా వైద్యారోగ్య అధికారి బాల మురళీకృష్ణ, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్‌కుమార్, జిల్లా ఉద్యాన అధికారి వరప్రసాద్, యూత్ కో–ఆర్డినేటర్ ఉజ్వల్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పదో తరగతి పరీక్షలకు 28,984 మంది విద్యార్థులు
ఓపెన్ టెన్త్ పరీక్షలకు 807 మంది విద్యార్థులు
ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 1553 మంది విద్యార్థులు
అధికారుల సమీక్షలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
Comments
Please login to add a commentAdd a comment