పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పూర్తిస్థాయిలో కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహన రావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక రైతు సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంశధార కాలువల ఆధునికీకరణకు రూ.1500 కోట్లు కేటాయించాలన్నారు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు ప్రారంభించి 17 ఏళ్లయినా నేటికీ 40 శాతం పనులు కూడా జరగలేదని తెలిపారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందించి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. పైడిగాం ప్రాజెక్టుకు గతంలో అంచనా వేసిన రూ.17 కోట్లు మంజూరు చేయాలని, ఈ ప్రాజెక్టు ఆధునీకరించడం ద్వారా మరో 7వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మందస మండలంలోని కళింగదళ్, డబార్సింగ్, దామోదర్ సాగరం ప్రాజెక్టులను ఆధునికీకరించాలని కోరారు. చీపి గడ్డ ద్వారా వృధాగా పోతున్న నీటిని గోపాలసాగరానికి మళ్లించాలని కోరారు. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న నారాయణపురం, తోటపల్లి, మడ్డువలస సాగునీటి ప్రాజెక్టులు పూర్తికి అవసరమైన మొత్తం నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment