అన్నింటా ఆయనే..
టెక్కలి జాతీయ రహదారిపై అధిక బరువుతో ఉన్న గ్రానైట్ బ్లాకులతో
ప్రమాదకరంగా
వెళుతున్న లారీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జిల్లాలో ఎవరి గ్రానైట్ క్వారీ నడవాలి..? ఎవరిది ఆపేయాలి..? ఏ క్రషర్ ఉంచాలి.. ఎవరిది ఉంచకూడదు.. ఇలా మైనింగ్‌కు సంబంధించి ప్రతీదీ కీలక నేత సోదరుడే డిసైడ్ చేస్తున్నారు. మైనింగ్ అనే కాదు.. ఇసుక, మద్యం, ధాన్యం కొనుగోలు.. అన్నింటా ఆయనదే రాజ్యం. మైనింగ్ ఆధిపత్యం వల్ల ఆయన అనుయాయులంతా లాభ పడుతుండగా.. మిగతా వ్యాపారులు మాత్రం క్వారీలు, క్రషర్లు మూసుకుని నష్టపోతున్నారు. గ్రానైట్ రాళ్లను రవాణా చేసే వాహనాల విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారు. తమకు కావాల్సిన డబుల్ హౌసింగ్ లారీలకు మాత్రమే రాళ్ల రవాణా అప్పగించాలని, కాదన్న వారిని దూరం పెట్టాలని హకుం జారీ చేశారు. ఫలానా నంబర్లు గల ట్రైలర్లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, మిగతా వాటిని ఎక్కడికక్కడ ఆపేయండని అధికార వర్గాలకు సూచన ప్రాయ ఆదేశాలిచ్చారు. ఈ వాహనాల్లో పరిమితికి మించి లోడింగ్ చేసుకుంటున్నా.. ఆయనను అడిగే నాథుడు లేకపోయాడు.
అంతా ఆయన కనుసన్నల్లోనే..
జిల్లాలో విస్తారంగా ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి గ్రానైట్ బ్లాకులను ప్రతి రోజూ 50 నుంచి 100 వరకు ట్రైలర్లు జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పాటు విశాఖపట్నం పోర్టుకు రవాణా చేస్తుంటాయి. విశాఖకు వెళ్లేవన్నీ పెద్ద బ్లాకులే. ఇంకా పెద్దవాటిని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా మనకు జిల్లాకు సంబంధించి గ్రానైట్‌ను మలేషియా, సింగపూర్, జపాన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇతర రాష్ట్రాలకు వస్తే బెంగళూరుకు ఎక్కువగా తరలిస్తారు. మధ్యస్తంగా ఉన్న బ్లాకులను జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పాలిషింగ్ యూనిట్లకు తరలిస్తుంటారు. ముఖ్యంగా నిమ్మాడ, పెదబమ్మిడి, వాండ్రాడ సమీపంలో 90 గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లకు అత్యధికంగా గ్రానైట్ క్వారీల నుంచి రవాణా చేస్తుంటారు. అలాగే, మెళియాపుట్టి మండలం వెంకటాపురం ఏరియాలోని పాలిషింగ్ యూనిట్లకు పంపిస్తుంటారు. ఈ గ్రానైట్ బ్లాకుల రవాణా అంతా కీలక నేత సోదరుడు చెప్పిన ట్రైలర్లతోనే చేయాలి. మిగతా వాటికి అప్పగిస్తే ఆ క్వారీ టార్గెట్ అయిపోయినట్టే. అందుకనే ఎందుకొచ్చిన గొడవ అని ఆ తమ్ముడు చెప్పిన ట్రైలర్లకే క్వారీ యజమానులు అప్పగిస్తున్నారు. జిల్లాలో 90కి పైగా ట్రైలర్లు ఉన్నాయి. వీటిలో 30 ట్రైలర్లు మాత్రమే తమకు కావాల్సినవని చెప్పి, వాటికి మాత్రమే రవాణా అప్పగించాలని హకుం జారీ చేశారు. దీంతో మిగతా 60కి పైగా ఉన్న ట్రైలర్ల యజమానులకు రవాణా పని దొరక్క నష్టపోతున్నారు.
చర్యలు తీసుకోరే..
దీనికి తోడు పరిమితికి మించి ఏకంగా 100 టన్నుల సామర్థ్యంతో బ్లాకులను తరలిస్తున్నా అధికారులు కిమ్మనడం లేదు. ‘సోదరుడు’ చెప్పిన నంబర్లు గల లారీలు కావడంతో వాటిని ఆపే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలా పరిమితికి మించి, సామర్థ్యాన్ని దాటి రవాణా చేసిన ట్రైలర్ ఒకటి ఇటీవల విశాఖ జిల్లా ఎండాడ దిశా మహిళా పోలీసు స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో భారీ బండ రాళ్లు(బ్లాకులు) జాతీయ రహదారికి అడ్డంగా పడిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పీఎంపాలెం పోలీసులు క్రేన్ల సహాయంతో వాటిని తొలగించడంతో అక్కడ ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ ఘటనలో కొందరికి గాయాలు కూడా అయ్యాయి. ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, మెళియాపుట్టి పరిసర ప్రాంతాల నుంచి రోజు వందల సంఖ్యలో గ్రానైట్ బ్లాకుల రవాణా అడ్డగోలుగా జరుగుతుందని, పరిమితికి మించి లోడింగ్ చేసి రవాణా చేస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఇటీవల కొందరు జిల్లా ఉన్నతాధికారికి, రవాణ శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ స్పందన లేదన్న వాదనలు ఉన్నాయి.
కీలక నేత సోదరుడి కనుసన్నల్లో అక్రమాలు
మైనింగ్, ఇసుక, మద్యం, ధాన్యం కొనుగోళ్లు.. అన్ని రంగాల్లో ఆయనే ఆధిపత్యం
గ్రానైట్ బ్లాకుల రవాణాలోనూ అక్రమాలే
సామర్థ్యానికి మించి లోడింగ్ చేసి రవాణా
ఇటీవల విశాఖ జిల్లా ఎండాడలో ప్రమాదానికి గురైన ఓ వాహనం
భారీ గ్రానైట్ బ్లాకులతో రవాణా అవుతున్న ట్రైలర్‌ను చూడండి. 22 టైర్ల గల ఈ వాహనంపై రాష్ట్ర పరిధిలో 57 మెట్రిక్ టన్నుల బ్లాకులను మాత్రమే రవాణా చేయాలి. రాష్ట్రం దాటితే 55టన్నుల సామర్థ్యం గల బ్లాకులనే రవాణా చేయాలి. కానీ, ఇప్పుడీ ట్రైలర్లపై రాష్ట్రంలోనే కాదు.. జిల్లాలోనే 100 టన్నులకు పైగా బరువుల గల బ్లాకులను ఎక్కించి రవాణా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటిని ఏ ఒక్క అధికారి అడ్డుకోవడం లేదు.
జిల్లాకు చెందిన కీలక నేత సోదరుడు అంతా తానై వ్యవహరిస్తున్నారు. మద్యం, ధాన్యం, ఇసుక, మైనింగ్.. ఇలా అన్నింటిలోనూ వేలు పెడుతున్నారు. అతగాడి జోక్యం ఉంటే చాలు ఆ అక్రమాల జోలికి అధికారులు వెళ్లడం లేదు. ‘ఆయనున్నాడు మనకెందుకులే.. మనకు ఎంతో కొంత వస్తుంది దాంతో సరిపెట్టుకుందాం’ అన్న ధోరణి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఇసుక దందా చేస్తున్నారు. ఈ విషయంలో కీలక నేత సోదరుడితో పాటు ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం నేతలకు భాగస్వామ్యం ఉంది. కానీ, సంబంధిత వర్గాలు మొత్తం కీలక నేత సోదరుడు చెప్పినట్టుగానే చేస్తున్నాయి. ఇక జిల్లాలోని మూడింతల మద్యం షాపులు కీలక నేత సోదరుడి కనుసన్నల్లోనే ఉన్నాయి. చాలా వరకు షాపులు ఆయన అనుయాయులు, కుటుంబీకులకే దక్కాయి. జిల్లాలో అక్రమాలకు దోహదపడ్డ మరో ప్రధాన అంశం ధాన్యం కొనుగోళ్లు. జిల్లాలో ధాన్యం కొనుగోలు లక్ష్యాలు, మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు, గోడౌన్‌లలో కస్లమ్ మిల్లింగ్ రైస్ స్టాక్ చేసేందుకు మిల్లర్ల దగ్గరి నుంచి ముడుపులు, సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యం బదులు పీడీఎస్ బియ్యం ఇచ్చే విషయంలో.. ఇలా ప్రతి దాంట్లోనూ ఆయన నిర్ణయాలే అమలవుతున్నాయి. మిల్లర్లు ఆవేదనతో ఉన్నా అధికారానికి భయపడి కక్కలేక, మింగలేక కుమిలిపోతున్నారు.
అన్నింటా ఆయనే..
అన్నింటా ఆయనే..
అన్నింటా ఆయనే..
Comments
Please login to add a commentAdd a comment